జగన్ సర్కారుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దక్షిణ కొరియా నుంచి తీసుకొచ్చిన ర్యాపిడ్‌ కిట్లు వాడుకోవచ్చని చెప్పేసింది. నిన్న టి వరకూ ఈ కిట్లపై వివాదం ఉంది. మేం చెప్పేవరకూ కొత్త కిట్లు వాడొద్దని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే చైనా కిట్లలో లోపాలు ఉన్నాయని.. కొరియా కిట్లతో ఇబ్బంది లేదని తాజాగా కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో ఏపీలో ర్యాపిడ్ పరీక్షలకు పచ్చ జెండా ఊపినట్టయింది.

 

 

ఏపీలో కొరియా కిట్లకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహార్ రెడ్డి తెలిపారు. కరోనా పరీక్షల విషయంలో వెనకడుగు వేయొద్దని ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా పరీక్షల సంఖ్య బాగా పెరిగినందుకు అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. దక్షిణ కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్ల పనితీరు బాగుందని అధికారులు సీఎంకు తెలిపారు.

 

 

మరోవైపు ఏపీలో కొత్తగా మరో 80 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 893కి చేరింది. గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 14, తూర్పు గోదావరి జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 18, కృష్ణా జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 31, విశాఖపట్నం జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా పరీక్షల సంఖ్య క్రమంగా పెంచాలని.. క్యాన్సర్‌, డయాలసిస్‌ వంటి రోగులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.

 

 

ఏ సమస్య ఉన్నా 1902కి కాల్‌ చేయాలని ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. 104కి కాల్‌ చేస్తే వెంటనే స్పందించేలా అధికారులు సిద్ధంగా ఉండాలని జగన్ ఆదేశించారు. డెలివరీ కేసులతోపాటు ఎమర్జెన్సీ కేసులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: