కరోనా దేశంలో విజృంభిస్తున్న వేళ ఏపీ సర్కారు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఏ విషయంలో అంటారా.. కరోనా టెస్టుల విషయంలో.. అవును దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా ఏపీ సర్కారు కరోనా టెస్టులు నిర్వహిస్తోంది. బుధవారం ఒక్కరోజే ఏకంగా 6,520 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు ఏపీ నిర్వహించింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకు మొత్తంగా 48,034 పరీక్షలు చేసినట్లైంది.

 

 

నిర్దేశించిన ప్రొటోకాల్‌ ప్రకారం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లతో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ కిట్లతో ఏపీలో ఇప్పటివరకు 14,423 టెస్టులు నిర్వహించారు. వాటిలో 11,543 టెస్టులు రెడ్‌జోన్లలోనే చేశారు. ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లతో చేసిన పరీక్షల్లో సుమారు 30కిపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిని నిర్ధారణ కోసం పీసీఆర్‌ టెస్టులకు పంపించారు ఏపీ అధికారులు.

 

 

వాస్తవానికి మన దేశంలో కరోనా కేసులు తక్కువగా ఉంటున్నాయని భావిస్తున్నా.. అందుకు కారణం సరైన సంఖ్యలో కరోనా కేసుల పరీక్షలు నిర్వహించకపోవడమే అన్న అభిప్రాయం ఉంది. కరోనా ర్యాపిడ్ పరీక్షలను విరివిగా నిర్వహిస్తే.. కరోనా ఏ మేరకు సమాజంలో ఉందో వాస్తవంగా తెలుస్తుంది. అందుకే ఏపీ సర్కారు కొరియా నుంచి ఏకంగా లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగు కిట్లను తెప్పించిన సంగతి తెలిసిందే.

 

 

వాస్తవానికి ఏపీలో ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ర్యాపిడ్ టెస్టింగ్ పరీక్షలు బాగా పెరిగిన నేపథ్యంలో ఇలా కేసులు పెరగడం సహజమే. అసలు టెస్టులు చేయకుండా మా దగ్గర కరోనా లేదు అని ప్రగల్బాలు పలికి.. ఆ తర్వాత ఇబ్బంది పడటం కంటే సాధ్యమైనంత ఎక్కువగా పరీక్షలు నిర్వహించి కరోనా రోగులను గుర్తించి ఈ వ్యాధిని కట్టడి చేయడమే సరైన వ్యూహమని జగన్ సర్కారు భావిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: