కరోనా సమయంలో ప్రత్యేకించి కొందరిపై ఎక్కువ దృష్టి సారించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచిస్తున్నారు. ప్రత్యేకించి ఇప్పటికే వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్‌ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ వ్యాధులున్న వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలన్నారు.

 

 

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో వైద్య యంత్రాగం అంతా కరోనాపై పోరాటంలో మునిగిపోయింది. ఈ సమయంలో ఇతర వ్యాధిగ్రస్తులపై దృష్టి కాస్త తగ్గింది. అయితే సాధారణ రోగుల సంగతి ఎలా ఉన్నా.. తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్‌ లాంటి వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే.. ఈ వ్యాధి గ్రస్తులకు రక్తం అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది.

 

 

కరోనా కారణంగా రక్త దానాలు ఆగిపోయాయి. దీంతో రక్తం నిల్వలు లేక తలసేమియా, డయాలసిస్ వంటి వ్యాధి గ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రత్యేకించి ఈ వ్యాధిగ్రస్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జగన్ సూచించారు. అదే సమయంలో కరోనా వైరస్‌ పరీక్షలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

 

 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎమర్జెన్సీ కేసులు, డెలివరీ కేసులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా కరోనా నివారణ చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: