అమెరికాలో క‌రోనా వైర‌స్‌ క‌ట్ట‌డికి అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌హ‌మ్మారి బారి నుంచి అమెరిక‌న్ల‌ను కాపాడుకునేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. ఇందు కోసం నిరంత‌రం ఆ దేశ ప‌రిశోధ‌కుల‌తో చ‌ర్చిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నిన్న వైట్‌హాస్‌లో జ‌రిగిన స‌మావేశంలో ట్రంప్ కొన్ని విష‌యాల‌పై బాగా ఆస‌క్తిచూపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అధిక ఉష్ణోగ్ర‌త‌, తేమ‌లో క‌రోనా వైర‌స్ త‌లుపుల హ్యాండిల్స్‌, ఇత‌ర ఉప‌రిత‌లాల‌పై ఎక్కువ స‌మ‌యం బ‌త‌క‌లేద‌ని, వేగంగా చ‌నిపోతుంద‌ని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అండర్ సెక్రటరీ బిల్ బ్రయాన్ ఈ సమావేశంలో వెల్ల‌డించారు. ఉపరితలాలపై వైర‌స్‌ను చంపడానికి ఇండోర్ ప్రదేశాలపై ఉష్ణోగ్రత, తేమను పెంచడంతోపాటు అమెరికన్లకు కొత్త చిట్కాల‌ను అందించాల‌ని బ్రయాన్ సూచించారు. వేసవి ఎండలో 70 నుండి 75 డిగ్రీల ఫారెన్‌హీట్, 80శాతం తేమలో వైరస్ ఉపరితలంపై కేవలం రెండు నిమిషాలు ఉంటుందని పరిశోధనలో తేలిందని, పొడి వాతావ‌ర‌ణం అద‌న‌పు ర‌క్ష‌ణ‌గా ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

 

ఈ సంద‌ర్భంగా ట్రంప్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. శ‌రీరంపై శ‌క్తిమంత‌మైన కాంతిని ప్ర‌స‌రింప‌జేయ‌వ‌చ్చా.. అంటూ ఇంకా ప‌రిశోధించాలంటూ సూచించారు. వెరీ ప‌వ‌ర్‌ఫుల్ లైట్ అంటే అతినీల‌లోహిత లేదా.. ఇత‌ర శ‌క్తిమంత‌మైన కాంతిని శ‌రీరాల‌పై, ఇత‌ర ఉప‌రిత‌లాల‌పై ప్ర‌యోగించే యోచ‌న‌లో ట్రంప్ ఉన్నార‌ని, ఆ స‌మావేశంలో ఆయ‌న ఈ అంశంపై ఆస‌క్తినిక‌న‌బ‌ర్చార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేగాకుండా.. బ్ర‌యాన్ మ‌రికొన్ని విష‌యాల‌ను కూడా వెల్ల‌డించారు. బ్లీచ్ ఐదు నిమిషాల్లో లాలాజలం లేదా శ్వాసకోశ ద్రవాలలో వైరస్‌ను చంపగలదని, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ దానిని మరింత వేగంగా చంపగలదని పరిశోధనలో తేలిందని బ్రయాన్ చెప్పారు. దీనిపై వెంట‌నే స్పందించిన ట్రంప్‌..ఆ వైపుగా కూడా వెంట‌నే మ‌రిన్ని ప‌రీక్ష‌లు చేయాల‌ని సూచించారు. అయితే.. ఇందులో ట్రంప్ ఏ విధానం వైపు మొగ్గుచూపుతారో చూడాలి మ‌రి. కాగా, అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు  870,000 మందికి పైగా క‌రోనా వైరస్ సోకింది. 49,000 మందికి పైగా మరణించారు. గురువారం ఒక్క‌రోజే సుమారు 20 వేల కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: