కరోనా ఈ పేరు వినడానికి చాలా బాగుంది.. కానీ ఇది చేస్తున్న పనులే చాలా భయంగా ఉన్నాయి.. ఎందుకంటే చాపకింద నీరులా వచ్చింది.. కానీ ప్రపంచదేశాలకు మేకులా మారింది.. బహుశ చాల మందికి ఊహ తెలిసినప్పటి నుండి ఇలాంటి సంక్షోభం ఎప్పుడు చూసి ఉండరు.. ఇది సంక్షోభం అనేకంటే ప్రమాదం, విధ్వంసం అనడం ఉత్తమం.. ఈ కరోనా దాడికి ఎందరి జీవితాలు అడ్రస్ లేకుండా పోతాయో.. ఎన్ని కుటుంబాలు ఆకలితో అలమటిస్తాయో.. బాల్యంలో ఆనందంగా గడపవలసిన పసి జీవితాలు మసి వారిపోతాయో ఊహించడం కష్టం..

 

 

ఇకపోతే కరోనా వైరస్ కారణంగా ముప్పై రోజులుగా రైలు, బస్సు, బడి, గుడి, హాల్‌, మాల్‌, పరిశ్రమలు... ఇలా సర్వం బంద్‌. ఈ బంద్‌ పేరే... ‘లాక్‌డౌన్‌’ ఇది అమలులోకి వచ్చి సరిగ్గా నెల! ఈ కట్టడి లేకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించడమూ కష్టమే! కానీ, లాక్‌డౌన్‌  విధించడం వల్ల కరోనా వ్యాప్తి ఆగిందా అంటే అదీ లేదు.. రోజు రోజుకు కొత్త కేసులు బయటకు వస్తూనే ఉన్నాయి.. ఇందుకు నిదర్శనమే ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తూన్న కరోనా రోగుల సంఖ్య.. ఇక్కడ రోజురోజుకూ వైరస్ తీవ్రత పెరుగుతోంది. అప్పటికే కరోనా సోకిన వారికి, క్వారంటైన్‌లో ఉన్న వారికి మాత్రమే పరిమితం కావాల్సిన మహమ్మారి... సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంది.

 

 

ఇక గురువారం ఒక్కరోజే 80 పాజిటివ్‌ కేసులు లెక్కతేలాయి! మరి... ఇది దేనికి సంకేతం.. లాక్‌డౌన్‌ పాక్షికంగా మాత్రమే విజయవంతమైందా? 30 రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఎంతవరకు ప్రభావితం చేసిందో లెక్క చెప్పడం కష్టం.. అదీగాక పేద బడుగు వర్గాలను మరింతగా పాతాళానికి తొక్కేసింది.. ఈ లాక్‌డౌన్ కరోనాను పూర్తిగా నిర్మూలించలేదు సరికదా.. ఆకలి చావులను పెంచుతుంది.. రాష్ట్రాలను అప్పుల్లోకి నెట్టివేస్తుంది.. అందరు ఇప్పటి కరోనాను గురించే ఆలోచిస్తున్నారు కానీ కరోనా కంటే భయంకరమైన సంక్షోభం ముందు ఉంది.. దీని కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారో అర్ధం కావడం లేదు.. ఉన్న వాడికి బ్రతుకు మీద తీపికోసం లాక్‌డౌన్ పొడిగిస్తే బాగుండు అని అనుకుంటాడు.. లేనివాడు లాక్‌డౌన్ తొలగిస్తే బాగుండు అని ఆశపడతాడు.. ఇది కరోనా యుద్ధం కాదు ఆకలి పోరాటం..

 

 

ప్రజలకు కరోనా సోకకుండా ఆపుతున్న ప్రభుత్వాలు ఆకలి చావులను ఆపుతాయా అని పేదలు ప్రశ్నిస్తున్నారు.. ఆకలితో చావడం కంటే కరోనాతో చావడం నయం అని అనుకునే వారు లేకపోలేదు.. ఇప్పటికే కరోనా లాక్‌డౌన్ వల్ల అన్ని రంగాలు నష్టపోయాయి.. ఇది ఇలాగే కొనసాగితే రాబోయేది వర్షాకాలం.. చలికాలం.. ఎవరు ఎన్ని రకాలుగా కట్టడి చేసిన అప్పుడు మాత్రం ప్రాణాలకు మరింతలా ప్రమాదం సంభవిస్తుంది.. అంతే కాకుండా లాక్‌డౌన్ సమయాల్లో సరిగ్గా తినీ తినక ఉండటం వల్ల పోషకాహారా లోపాలతో పేదల ఆరోగ్యాలు మరింతగా క్షిణించే అవకాశం ఉంది.. ఏది ఏమైనా లాక్‌డౌన్ అనేది దోమతెరలాంటిది మాత్రమే కానీ పూర్తి పరిష్కారం మాత్రం కాదనే వాదన వినిపిస్తుంది.. దీని వల్ల నష్టపోయేది పేద మధ్యతరగతి ప్రజలే.. ఇకపోతే రానున్న రోజుల్లో కరోనా చరిత్రను తప్పక తిరగరాస్తుంది.. ఎన్నో చేదు సంఘటలను కళ్లముందు నిలుపుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: