కరోనా వైరస్ మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తోంది...! దేశంలోనే అత్యధిక కేసులతో మహారాష్ట్ర సతమతమవుతుంటే...మరోవైపు ఉద్ధవ్‌ థాక్రే ప్రభుత్వానికి రాజ్యాంగ సంక్షోభంలో కూరుకుపోతోంది. మరో నెలరోజుల్లో ఉద్ధవ్ థాక్రే చట్టసభ సభ్యుడు కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి.

 

కొన్ని సంక్షోభాలు... కొత్త సంక్షోభాలను సృష్టిస్తాయి. మహారాష్ట్రలో అదే జరుగుతోంది. దేశ మొత్తానికి మహారాష్ట్ర కరోనా హాట్ స్పాట్ గా మారిపోయింది.  కేసులు మరణాల్లో మొదటి స్థానంలో ఉంది. మూడో దశ వ్యాప్తి కూడా ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. కరోనాను ఎలా నియంత్రించాలో అర్ధంకాక ప్రభుత్వం , అధికారులు తలపట్టుకున్నారు. అయితే కరోనాను మించిన రాజకీయ సంక్షోభం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చుట్టూ తిరుగుతోంది. సీఎంగా థాక్రే భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మే 28 తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే... రాజ్యాంగ సంక్షోభాన్ని దాటాలి. కానీ ఆ పరిస్థితులు మాత్రం కనిపించడంలేదు.

 

ఉద్ధవ్‌ థాక్రే... మహారాష్ట్ర శాసన సభలో గానీ, మండలిలో గానీ సభ్యుడు కారు. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం, బీజేపీ శివసేన మధ్య విభేదాలు రావడం... చివరకు కాంగ్రెస్,ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. మహా కూటమి అధినేతగా పోయిన ఏడాది నవంబర్ 28న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు ఉద్ధవ్‌ థాక్రే.  ఆయన కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం కూడా ఇదే తొలిసారి. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల వ్యవధిలో థాక్రే చట్ట సభలకు ఎన్నికవ్వాలి. సాధారణ పరిస్థితుల్లో ఇది పెద్ద విషయం కాదు. థాక్రే కావాలనుకుంటే ఏదైనా స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలవొచ్చు...లేదా... శాసన మండలికి ఏదో ఒక కోటాలో నామినేట్ కావొచ్చు. కరోనా సంక్షోం లేకపోతే ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగిపోయేవి. అయితే కరోనా ఉద్ధవ్ థాక్రే భవిష్యత్తుకు అడ్డుగోడగా నిలిచింది.

 

షెడ్యూల్ ప్రకారం మార్చి 26న మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికలు జరగాలి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలని ఉద్ధవ్ థాక్రే నిర్ణయించుకున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా మండలి ఎన్నికలను ఎన్నికల సంఘం నిరవధికంగా వాయిదా వేసేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. రాజు తలచుకుంటే ఏదైనా చేయొచ్చు కదా అనుకున్న థాక్రే... ప్లాన్ బి సిద్ధం చేసుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ కావాలని థాక్రే భావించారు. గవర్నర్ ఓ సంతకం పెడితే చాలు క్షణాల్లో థాక్రే ఎమ్మెల్సీగా మారిపోతారు. కానీ రాజ్‌భవన్ కూడా అడ్డుపడింది. మహారాష్ట్ర గవర్నర్ బీకే కొషియారి ఢిల్లీ మనిషి. పైగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేనకు ఆయన సహకరించే అవకాశం లేదు. 

 

గవర్నర్ కోటాలో ఉద్ధవ్‌ థాక్రేను నామినేట్ చేయాలంటూ మహారాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదించలేదు.  వాస్తవానికి వివిధ రంగాల్లో సామాజిక సేవ చేసిన వాళ్లను మాత్రమే గవర్నర్ కోటా కింద నామినేట్ చేస్తారు. రాజకీయ నాయకుడిని నామినేట్ చేయకూడదన్న రూల్ ఏమీ లేకపోయినా... గవర్నర్ విచక్షాధికారమే ఇక్కడ కీలకం. రాజ్‌భవన్ రాజకీయాలు చేస్తోందంటూ శివసేన విమర్శిస్తున్నా... కొషియారి పట్టించుకోలేదు. దీంతో ఉద్ధవ్‌ థాక్రే భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో ఉంది. మే 28 లోపు చట్ట సభ సభ్యుడిగా మారకపోతే ఉద్ధవ్‌ థాక్రే  కచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. శాసన మండలి లేదా...శాసన సభ సభ్యత్వం లేని వ్యక్తిని ఆరు నెలలు కంటే ముఖ్యమంత్రిగా ఉండటానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 క్లాజ్ 4 అంగీకరించదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: