కరోనా సమస్త మానవాళిని, జీవరాశులను పట్టిపీడిస్తోంది. కరోనా భారినపడి మనుషులు ప్రత్యక్షంగా చనిపోతుంటే పరోక్షంగా మూగజీవాలు ప్రాణాలు వదులుతున్నాయి. వైరస్‌ వ్యాపించకుండా లాక్‌డౌన్‌ అమలు చేస్తే... ఆహారం, నీరు దొరక్క వానరాలు అలమటించి చనిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో 15 రోజులుగా కోతులు మృత్యువాతపడుతున్నాయి.

 

కరోనా వైరస్‌ పెద్ద ఉత్పాతాన్నే సృష్టిస్తోంది.  మూగజీవాలు సైతం వైరస్‌ ప్రభావంతో ఆకలితో అలమటించి చనిపోతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా మనుషుల సంచారం తగ్గి మూగ జీవాలకు ఆహారం కొరత ఏర్పడింది. సాధారణ రోజుల్లో హోటళ్లు, దుకాణాలు, చికెన్ సెంటర్ల వ్యర్థ పదార్థాలు దొరికేవి. లాక్ డౌన్ కారణంగా ఇవి మూతపడడంతో మిగులు పదార్థాల లభ్యత లేకుండా పోయింది. దీంతో కోతులు, కుక్కలు, పక్షులు వంటి మూగ జీవాలకు ఆహారం దొరకడం లేదు. పుణ్యక్షేత్రాలు, రహదారుల వెంట నివసించే కోతులు జనం వేసే ఆహారంపైనే ఆధారపడతాయి. పుణ్యక్షేత్రాలు మూతపడడం, ప్రయాణీకుల వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంలో కోతులకు ఆహారం లేకుండా పోయింది. వేసవి కారణంగా నీటి లభ్యత కూడా తగ్గింది. దీంతో మూగ జీవాలు ఆకలి, దప్పులతో అలమటించి ప్రాణాలు కోల్పోతున్నాయి. 

 

కర్నూలు జిల్లాలో 15 రోజులుగా వివిధ ప్రాంతాల్లో వరుసగా కోతులు మృతి చెందుతున్నాయి. అక్కడక్కడా పక్షులు చనిపోతున్నాయి. మంత్రాలయం మండలం చెట్నేహల్లి వద్ద రెండు వారాల క్రితం 20కి పైగా కోతులు చనిపోయాయి. రెండు రోజుల క్రితం గడివేములలో 30 కోతులు మృతి చెందాయి. కొన్ని చెట్లపైన, గోడలపైనే ప్రాణాలు వదులుతున్నాయి. ఆహారం లేక శబ్ధాలు చేస్తూ కోతులు చనిపోతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో నల్లమల అటవీ ప్రాంతంలో కోతులు పెద్ద ఎత్తున రోడ్లపై ప్రయాణీకులు అందించే ఆహారం కోసం ఎదురు చూస్తుంటాయి. వాహనాల రాకపోకలు, జనసంచారం లేకపోవడంతో కోతులు ఆకలితో అలమటిస్తున్నాయి.

 

మంత్రాలయం మండలం చెట్నేహల్లి, గడివేముల లో కోతులు కరోనా వైరస్ తో చనిపోయాయా అని స్థానికులు మొదట భయపడ్డారు. కరోనా కారణమా అనే కోణంలో పశుసంవర్ధక శాఖ అధికారులు అవశేషాలు సేకరించారు. మృతి చెందిన కోతులకు పోస్టుమార్టం చేస్తే ఆహారం, నీరు లేక చనిపోయినట్టు నిర్ధారణ అయింది. కోతులకు, పక్షలుకు ఆహారం ఇవ్వాలని పశు వైద్యులు స్థానికులకు విజ్ఞప్తి చేశారు. పెద్దప్రేగు, చిన్న ప్రేగుల్లో ఆహార పదార్థాల అవశేషాలు పోస్టుమార్టంలో కన్పించలేదని సమాచారం. ఎమ్మిగనూరులోను కాకులు, గద్దలు మృతి చెందాయి. 

 

నల్లమల అటవీ ప్రాంతంలో రోడ్డు మార్గంలో ఆహారం లేక కోతులు అలమటిస్తుంటే కొందరు పోలీసులు స్పందించారు. శ్రీశైలం వెళ్లే మార్గంలో నల్లమల అటవీ ప్రాంతంలో కోతులకు పండ్లు, కూరగాయలు  అందిస్తున్నారు. దోర్నాల, ఆత్మకూరు మధ్య కూడా పెద్ద ఎత్తున కోతులు ప్రయాణీకులు ఇచ్చే ఆహారం కోసం ఎదరుచూస్తుంటాయి. ఇప్పటికీ అక్కడ ఆహారం దొరక్క కోతులు ఆకలితో అలమటిస్తున్నాయి.

 

అటవీ శాఖాధికారులు, పశు సంవర్ధక శాఖ సమన్వయంతో కోతులు, పక్షులకు ఆహారం అందిస్తే అవి ప్రాణాలతో బయటపడతాయి.  గ్రామాల సమీపంలో ఉండే పక్షులు,  కోతుల వంటి మూగ జీవాలకు స్థానికులే కొన్నాళ్లపాటు ఆహారం అందిస్తే వాటి మనుగడ మనకు కనిపిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: