కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ మటన్‌పై పడింది. దీంతో రేట్లను ఇష్టానుసారంగా పెంచి అమ్మేస్తున్నారు వ్యాపారులు. ప్రస్తుతం కిలో వెయ్యి నుంచి 12 వందలకు అమ్ముతున్నారు. మరోవైపు రేట్లు పెంచితే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. 

 

లాక్‌డౌన్‌తో మాంసాహారానికి డిమాండ్ పెరిగింది. మార్కెట్‌లో మటన్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. కిలో మటన్ ధర 1200కి పెరిగింది.  గత వారం కిలో మటన్ ధర 900గా ఉంటే.. ఇప్పుడు 12 వందలకి చేరింది. మటన్ ధరలు మండిపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. లాక్‌డౌన్ కారణంగా పశువుల కొరత ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లయ్ లేదు. ఈ కారణంగా మటన్ రేటు అమాంతం పెరిగింది. ఓవైపు కరోనా వైరస్ భయం, మరోవైపు లాక్ డౌన్, ఈ భయాలతో డ్రైవర్లు విధులకు రావడం లేదు. మరోవైపు మేకలు,  గొర్రెల సరఫరా ఆగిపోయింది. ప్రధాన మార్కెట్ లో అమ్మే ఏజెంట్లు, రైతులు విపరీతంగా ధరలు పెంచేశారు

 

మటన్ ధర కిలోపై ఏకంగా 200 నుంచి 300 రూపాయలు ఒకేసారి పెరగడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. మటన్‌ రేటు పెరగడానికి మరో కారణం ఉంది.  చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీంతో చికెన్ తినే వాళ్లు సంఖ్య భారీగా తగ్గిపోయింది. వారు కాస్తా మటన్ వైపు మొగ్గారు. దీంతో భారీగా డిమాండ్ పెరిగింది. 

 

మరోవైపు మటన్‌ రేట్ల పెరగడంపై సర్కార్‌ సీరియస్‌ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాంసం విక్రయదారులు ఇష్టానుసారంగా ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వం, అధికారులు సూచించిన ధరలకే మాంసం విక్రయాలు జరపాలని సూచించింది. లాక్‌డౌన్‌తో  కష్టాలు పడుతుంటే.. ఇలా రేట్లు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు వినియోగదారులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: