ఇటీవ‌ల అనూహ్య ప‌రిణామాల‌తో వార్త‌ల్లోకి ఎక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్ కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా త‌న స‌హ‌జ‌ సిద్ధ‌మైన రీతిలో స్పందిస్తూనే మ‌రికొంద‌రు నేత‌లపై సైతం అదే రీతిలో విరుచుకుప‌డ్డారు. టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు నాయుడు త‌న ప‌రిపాల‌నలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాన్ని  మూడున్నర లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసినా కూడా ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఎలా ముందుకు వెళ్తున్నారో ప్ర‌జ‌లంతా కళ్లారా చూస్తున్నార‌ని అన్నారు. 

 


కరోనా మహమ్మారి వల్ల రాష్ర్టానికి  ఆదాయం లేకపోయినా అక్కచెల్లెళ్లను కాపాడాలి అని సున్నా వడ్డీ పధకాన్ని మళ్లీ అమలు చేస్తున్నారని రోజా అభినందించారు. ``90 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రాష్ర్టవ్యాప్తంగా వారి అకౌంట్లలోకి 1400 కోట్ల రూపాయలు రావడమనేది చాలా సంతోషించాల్సిన విషయం. ఒక మహిళగా మహిళలందరి తరపున నేను సీఎంకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. కరోనా సమయంలో, ఆదాయం లేని సమయంలో ఏదైనా సాకులు చెప్పి తప్పించుకోవచ్చు. అలా తప్పించుకునే మనస్తత్వం లేకుండా ఎప్పుడూ కూడా ఆడపడుచులకు అన్నా, తమ్ముడిగా ఉండాలన్న జగన్ ఆలోచనను నేను అభినందిస్తున్నాను.`` అని పేర్కొన్నారు. 

 


సున్నా వడ్డీ పెద్ద విషయం కాదు డ్వాక్రా రుణాలు మాఫి చేస్తామన్నారు అది చేయండి అంటూ టీడీపీ మహిళా నేతలు మాట్లాడుతుండ‌టం నిజంగా చిత్రంగా ఉంద‌న్నారు. ``అసలు అక్క చెల్లెళ్ల గురించి డ్వాక్రా మహిళల గురించి మాట్లాడే అర్హత టీడీపీ వారికి ఉందా అని ప్రశ్నిస్తున్నాను. గతంలో 2016-2019 వరకు సున్నావడ్డీ ఇవ్వకుండా దాదాపు మూడువేల కోట్ల రూపాయలు చంద్రబాబు ఎగ్గొట్టి మోసం చేసిన విషయాన్ని టీడీపీ మహిళా నేతలు గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. చంద్రబాబు అసలు వడ్డీతో సహా మాఫి చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి వారిని అప్పుల్లో ముంచేసి వెళ్లారు. వారికి జగన్ గురించి మాట్లాడేందుకు అర్హత ఉందా అని అడుగుతున్నాను. మా మేనిఫెస్టో వారు చదివారో లేదో తెలియదు గాని ఒకసారి కళ్లు తెరిచి చూడండి. రెండో సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాలు నాలుగు విడతలుగా డ్వాక్రా లోన్ అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకి వేస్తామని జగన్ చెప్పారు. దాని ప్రకారం చేస్తారని మీ అందరికి తెలియచేస్తున్నాను.`` అని రోజా వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: