వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఈరోజు ట్విట్టర్ ఖాతా ద్వారా వైసీపీ ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేశారు. ఏపీలో నేతన్నల దగ్గర తయారై సిద్ధంగా ఉన్న స్టాక్ ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సూచనలు చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని... వీరికి ప్రభుత్వం 15,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని సూచించారు. 
 
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నేతన్నలు కష్టాలు పడుతున్నారని... ప్రభుత్వం వారిపై దయ చూపుతుందని తాను భావిస్తున్నాననిపేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు మూడున్నర లక్షన్నర మంది నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారని... లాక్ డౌన్ ప్రభావం పవర్ లూమ్ కార్మికులపై కూడా పడుతోందని అన్నారు. లాక్ డౌన్ వల్ల వారి జీవన విధానం దెబ్బ తిందని.... ఉత్పత్తులు అమ్ముడవక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. 
 
ట్విట్టర్ ఖాతా ద్వారా వైసీపీ ప్రభుత్వంపై, జగన్ పై విమర్శలు చేసే లోకేశ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్ సర్కార్ కు విజ్ఞప్తులు చేయడం గమనార్హం. మరి లోకేష్ విజ్ఞప్తుల పట్ల సీఎం జగన్, వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో సీఎం జగన్ నేతన్నలకు ప్రయోజనం చేకూర్చటం కోసం వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. 
 
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు 24,000 రూపాయల నగదు సహాయం చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాదయాత్రలో చేనేతల కష్టాలను దగ్గరినుంచి చూసిన జగన్ మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. గతేడాది ప్రభుత్వం ఈ పథకం కోసం దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ప్రభుత్వం లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇప్పటికే అర్చకులకు, మత్స్యకారులకు, ఇతరులకు ప్రయోజనం కలిగేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. చేనేత కార్మికులకు నాలుగు నెలల క్రితమే ప్రభుత్వం 24,000 రూపాయలు జమ చేయడంతో ప్రస్తుతం మరోసారి సహాయం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: