నెత్తిన పట్టిన శని వదిలించుకునేందుకు కాళహస్తి వెళ్తాం..! రాహుకేతు పూజలు చేయించుకుంటాం. కానీ ప్రస్తుతం అక్కడ అడుగుపెడితే.. ఉన్న శని పోవడం పక్కనపెడితే..  కరోనా కాటేసే ప్రమాదం మాత్రం పుష్కలంగా కనిపిస్తోంది. ప్రమాదకర స్థాయిలో కేసులు పెరిగిపోవడంతో శ్రీకాళహస్తిని పూర్తిగా షట్‌డౌన్‌ చేసింది ప్రభుత్వం. 

 

కరోనా వైరస్‌ చిత్తూరు జిల్లా నలుమూలలకు క్రమంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలోని శ్రీకాళహస్తి, నగరి, నిండ్ర, పుత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో క్రమంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇటు జనాల బాధ్యతారాహిత్యం, అటు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం... కలిసి జిల్లాలో ఈ పరిస్థితి తలెత్తిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  జిల్లాలో  73 కేసులు నమోదు కాగా... ఒక్క శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే దాదాపు  50 మందికి వైరస్‌ సోకింది. వారిలో 18 ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం.. మరింత ఆందోళన కలిగిస్తోంది. 

 

కేవలం రెండు రోజుల్లో వచ్చిన టెస్టు ఫలితాలతో ఏడు మండలాలకు వైరస్‌ వ్యాపించినట్టు తేలింది. ఢిల్లీ, లండన్‌ మూలాలతో కరోనా వైరస్‌ వ్యాప్తికి శ్రీకాళహస్తి హాట్‌స్పాట్‌గా మారింది. కరోనా కట్టడి విధుల్లో వున్న ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మరిన్ని మండలాలకు వైరస్‌ విస్తరించింది. వీటిలో కొన్నింటికి కనీసం మూలాలు తెలుస్తుండగా... మరికొన్నింటికి మాత్రం అంతుచిక్కడం లేదు.  జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు ఆరువేల శ్యాంపిళ్లు టెస్టింగ్ చేయగా అందులో 4 వేల శాంపిల్స్‌ ఫలితాలు వచ్చాయి. మిగిలినవి ఇంకా రావాల్సి ఉంది. శ్రీకాళహస్తి మున్సిపాల్టీ పరిధిలోనే 47 పాజిటివ్‌ కేసులు రాగా.. అందులో ఏడుగురు పోలీసులు, ముగ్గురు వీఆర్వోలు, ఇద్దరు వాలంటీర్లు, మరో ఇద్దరు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. తాజా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకాళహస్తిని  పూర్తిగా షట్‌డౌన్‌ చేసింది ప్రభుత్వం. 

 

చిత్తూరు జిల్లాలో ప్రత్యేకించి శ్రీకాళహస్తిలోనే  వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఇంతవరకూ ఢిల్లీ మూలాలతోనే కేసులు పెరుగుతున్నాయని భావించినా.... వచ్చిన ఫలితాలతో లండన్‌ మూలాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయని తెలుస్తోంది.  అయితే స్థానికులు అందరికీ పరీక్షలు నిర్వహించడం  తప్ప వైరస్‌ కట్టడికి వేరే మార్గం కనిపించడం లేదు. 
మరోవైపు నిండ్ర, నారాయణవనం, పిచ్చాటూరు మండలాలను రెడ్ జోన్ పరిధి లోకి తీసుకొచ్చారు అధికారులు. నిరంతరం ఫుల్‌ సెక్యూరిటీతో కాళహస్తిని అష్టదిగ్బంధనం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: