కరోనా  లక్షణాలు ఉన్న వారికి వైద్యం చేయవద్దని చెప్పిన వినకుండా  కొంపముంచుతున్నారు  ఆర్‌ఎంపీ  వైద్యులు.  తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి,  కత్తిపూడిల్లోని ఇద్దరు  ఆర్‌ఎంపీ  వైద్యులు చేసిన నిర్వాకం కారణంగా 20 మందికి  పాజిటివ్  కేసులు నమోదు అయ్యాయి. ఆర్‌ఎంపీ  వైద్యుల  నిర్వాకంతో   20 మందికి  పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.   ప్రైవేటు క్లినిక్‌ల మూతను అవకాశంగా మల్చుకొని ట్రీట్ మెంట్   చేయడంతో కరోనా వైరస్ విజృంభించింది.

 

వద్దన్నా.. వినట్లేదు.. తూర్పుగోదావరి జిల్లాలో కొందరు ఆర్‌ఎంపీల వైద్యం కొంప ముంచుతోంది. కరోనా లాక్‌డౌన్‌లో ప్రైవేటు క్లినిక్‌ల మూతను అవకాశంగా మల్చుకుని ట్రీట్ మెంట్  చేస్తున్నారు.  ఢిల్లీ, కర్నూలు వచ్చిన వారితోపాటు జ్వరం, దగ్గు లక్షణాలున్న వారికీ రహస్య సేవలు  అందిస్తున్నారు.  పదేపదే వైద్యశాఖ హెచ్చరించినా సమాచారం ఇవ్వకుండా వైద్యం చేయడంతో  కత్తిపూడి ఉపాధ్యాయుడు, రాజమండ్రిలో  యువతికి  ఆర్‌ఎంపీల వైద్యం  చేసినట్టు తెలింది.  ఈ రెండు ఘటనల్లో నిర్లక్ష్యంతో ఏకంగా 20  పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 

 

రాజమండ్రి ఆర్‌ఎంపీకి  పాజిటివ్ రావడంతో  ఇతనితో  కాంటాక్ట్స్‌ కింద 80 మంది నుంచి శాంపిళ్లు సేకరించారు. ఇందులో ఎన్ని పాజిటివ్‌లు నిర్ధారణ అవుతాయేమోనని వైద్యశాఖలో ఆందోళన నెలకొంది.  తూర్పుగోదావరి జిల్లా  వ్యాప్తంగా ఇప్పటి వరకు  పాజిటివ్‌ కేసులు  సంఖ్య 32కు చేరింది.. కరోనా కట్టడికి ఒకవైపు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా కొందరు ఆర్‌ఎంపీల తీరుతో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎడాపెడా పెరిగిపోతున్నాయి. బాధ్యత మరిచి కాసుల కోసం రహస్యంగా వైద్యం చేస్తుండడంతో వ్యక్తుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితులు తలెత్తుతున్నాయి. కరోనా ముప్పు నేపథ్యంలో సొంత వైద్యం చేయవద్దని, ఎవరైనా జ్వరం లక్షణాలతో వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వైద్యశాఖ హెచ్చరిస్తున్నా కొందరు ఆర్‌ఎంపీలు మాత్రం తమదారి తమదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కత్తిపూడి ఉపాధ్యాయుడు, రాజమండ్రిలో  కర్నూలు నుంచి వచ్చిన యువతికి  రహస్యంగా ఆర్‌ఎంపీలు వైద్యం చేయడం, ఈ రెండు కేసుల ద్వారా 18 మందికి వైరస్‌ వ్యాప్తి జరగడం జిల్లాను కుదిపేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రైవేటు క్లినిక్‌లు మూతపడ్డాయి. వైరస్‌ భయంతో వైద్యులు ఆన్‌లైన్‌లోనే వైద్యం చేస్తున్నారు. క్లినిక్‌లు లేక కొందరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించిన వైద్యశాఖ టెలీ మెడిసిన్‌ అందుబాటులోకి తెచ్చింది. టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే సమస్య పరిష్కరిస్తామని ప్రకటించింది. గ్రామాలు,పట్టణాల్లో ఆర్‌ఎంపీలు సొంత వైద్యం చేయవద్దని కూడా హెచ్చరికలు జారీ చేసింది. కానీ పలుచోట్ల ఆర్‌ఎంపీలు ప్రైవేటు క్లినిక్‌లు మూతపడడాన్ని అవకాశంగా మల్చుకుని పరిధి అతిక్రమించి వైద్యం చేసేస్తున్నారు. జనం కూడా క్లినిక్‌లు లేవనే కారణంతో వీరినే ఆశ్రయిస్తున్నారు. ఇలా వచ్చే కేసుల్లో జ్వరం ఉన్న వారి వివరాలు ప్రభుత్వానికి అందించకుండా రహస్యంగా వైద్యం చేస్తున్నారు.

 

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా  కత్తిపూడిలో ఓ ఉపాధ్యాయుడికి ఇలాగే వారంపాటు జ్వరానికి వైద్యం చేయడంతో పరిస్థితి విషమించి న్యుమోనియాకు దారితీసింది. తీరా వైద్య పరీక్షలు చేస్తే పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇతడి ద్వారా అదే ప్రాంతంలో 5గురికి వైరస్‌ వ్యాపించింది. ఈ ఘటన మరువక ముందే రాజమండ్రిలో మరో ఆర్‌ఎంపీ నిర్వాకంతో 14  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇటీవల కర్నూలు నుండి  వచ్చిన ఓ యువతి కుటుంబ సభ్యులు ఇంట్లో రహస్యంగా దాచగా, ఆర్‌ఎంపీ వైద్యుడు చికిత్స చేశారు. తీరా ఇప్పుడు ఆ  45 ఏళ్ల ఆర్‌ఎంపీతోపాటు 12 మందికి  పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  ఆ  ఆర్‌ఎంపీ వైద్యుడు స్థానికంగా రోజుకు 60 మంది వరకు  కొన్నిరోజులుగా వైద్యం అందిస్తున్నారు. ఇతడి ఇంటికి సమీపంలోనే కొబ్బరి, అరటి వ్యాపారులు, ఇతర కార్మికులు ఉండడంతో వారిలో చాలా మంది క్లినిక్‌లు లేక ఇతడినే ఆశ్రయించారు. దీంతో కరోనా సోకిన ఆర్‌ఎంపీ వైద్యుడితో సేవలు పొందిన మిగిలినవారు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం 80 మంది కాంటాక్ట్స్‌ను గుర్తించారు. కరోనా పాజిటివ్  వచ్చిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ది నారాయణపురం. స్టేడియం వెనుక భాగంలోని మంగళవారపుపేటలో క్లినిక్‌ నడుపుతున్నాడు. అతని వద్దకు రోజుకు 60 మందికి పైగా వైద్యం కోసం వస్తుంటారు. కొబ్బరికార్మికులు, జట్టుకార్మికులు, ఈ ప్రాంతంలోని పేదలు కూడా ఇక్కడే వైద్యం చేయించుకుంటారు. ఢిల్లీ మీటింగ్‌తో సంబంధం ఉన్న ఒక వ్యక్తికి వైద్యం చేయడం ద్వారా ఇతడికీ ఇప్పుడు కరోనా సోకింది. దీంతో దొంగచాటుగా వైద్యం చేసి, కరోనా రోగం పాలైన వైద్యుడి ఉదంతం చర్చనీయాంశమైంది. ఆయనతో సంబంధం ఉన్నవారిని పరీక్షల కోసం తరలిస్తున్నారు. ఆర్‌ఎంపీని ఆసుపత్రికి తీసుకుని వెళ్లిన ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్,  ఇద్దరు ఎ.ఎన్.ఎం.లను సైతం  క్వారెంటైన్ కు  తరలించారు.  

 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కరోనా లక్షణాలతో వచ్చిన వారికి రహస్యంగా వైద్యం చేస్తే జైలుశిక్ష తప్పదని ఆర్‌ఎంపీలను  జిల్లా వైద్యశాఖ పదే పదే హెచ్చరిస్తోంది. అయితే అధికారులు వైద్యశాఖ కూడా వీరి విషయంలో కొంత నిర్లక్ష్యంగానే ఉంది.  ఇదే ఇప్పుడు కొంపముంచినట్లయింది. దొంగచాటు వైద్యం చేసిన వారిపై  చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్య అధికారులు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: