జగన్ అంటేనే దూకుడు. ఆయనకు చెక్ చెప్పాలనుకుంటే కాంగ్రెస్ లాంటి వందేళ్ళ పార్టీయే ఏపీలో  సొదిలోకి లేకుండా పోయింది.  అటువంటి జగన్ పదేళ్ళ రాజకీయమంతా దూకుడుగానే సాగింది. ముఖ్యమంత్రిగా కూడా ఆయన అదే వేగంతో సాగుతున్నారు. అందరికీ తెలియని విషయం ఏంటంటే జగన్ కి అన్నీ తెలుసు.

 

ఆయనకు సక్సెస్ సీక్రెట్ చాలా బాగా తెలుసు. దాంతో జగన్ తాను అనుకున్న విధంగా ముందుకు సాగుతున్నారు. ఇక జగన్ ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో రాజధానిని విశాఖ మార్చాలని అనుకున్నారు. కానీ అది జరిగేటట్టు కనిపించడంలేదు. ఎందుకంటే కరోనా కాలాన్ని అలా మింగేస్తోంది. దానికి తోడు విపక్షాల రాజకీయం, కోర్టు కేసులు ఇవన్నీ కలసి జగన్ అడుగు ముందుకు వెళ్ళలేకపోతున్నారు.

 

ఎట్టిపరిస్థితుల్లో రాజధానిని విశాఖ తరలించడం ఖాయమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పిన వెంటనే ప్రజా వాజ్యం కోర్టులో పడిపోయింది. దాని మీద ప్రభుత్వం ఇచ్చిన వివరణ చూస్తే ఇప్పట్లో అమరావతిని కాదని జగన్ ఎక్కడికీ పోలేరని అర్ధమవుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనకు అసెంబ్లీలో మద్దతు లభించింది. ఇక శాసనమండలిలో బ్రేక్ పడింది. అక్కడ సెలెక్ట్ కమిటీ కూడా  అఫీషియల్ గా ఏర్పాటు కాకపోవడంతో బిల్లు పాస్ అయినట్లేనని వైసీపీ సర్కార్ అంటోంది.

 

కానీ అది  ద్రవ్య బిల్లు కాదు కాబట్టి శాసన‌మండలికి మళ్ళీ రావాల్సిందేనని టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే బిల్లు చట్టం అయితే తప్ప రాజధాని తరలింపు ఉండదని వైసీపీ సర్కార్ కోర్టులో నివేదిక ఇచ్చింది. అంటే బిల్లు చట్టం కావడం అంటే చాలా ప్రక్రియ ఉంది. అది అయ్యేటప్పటికి  కొత్త విద్యాసంవత్సరం వస్తుంది. దాంతో ఈ ఏడాది జగన్ అమరావతి నుంచి కదలలేరు. సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు కుదరదు కాబట్టి మరో ఏడాది ఇది వాయిదా పడుతోంది. అప్పటికి ఎన్ని మార్పులు వస్తాయో, ఏమో. మొత్తానికి జగన్ అనుకున్న విశాఖ  రాజధానికి మాత్రం అతి పెద్ద బ్రేక్ పడినట్లైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: