ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదైన కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాలపై మరింత దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెడ్ జోన్లలో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తే మాత్రమే వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతి వీధి చివరలో నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. 
 
కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పాస్ ఇచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలకు సమస్యల్లేకుండా, డయాలసిస్ లాంటి చికిత్సలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యల గురించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సమీక్షలో మంత్రి ఆళ్ల నాని సీఎం జగన్ కర్నూలు, గుంటూరు నగరాల్లో కొన్ని ప్రాంతాలకే కరోనా వ్యాప్తి చెందిందని.... అన్ని ప్రాంతాలకు వైరస్ విస్తరించలేదని చెప్పారు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని... ఈ ప్రాంతంపై దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. అధికారులు కొన్ని ఆస్పత్రులను కరోనా ఆస్పత్రులుగా ప్రకటించామని.... ఆ ఆస్పత్రులలో రోజువారీ సేవలను వేరే ఆస్పత్రులకు మార్చామని జగన్ కు చెప్పారు. 
 
అత్యవసర సేవల కోసం వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. వైద్యం కోసం టెలీమెడిసిన్ ను సంప్రదిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. జగన్ అధికారులకు మరింత సమర్థవంతంగా టెలీమెడిసిన్ ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డీఆర్డీవో ద్వారా మొబైల్ ల్యాబ్ ను ఏర్పాటు చేసుకోవాలని.... వలస కూలీలు, వివిధ క్యాంపుల్లో ఉన్నవారిని పరీక్షించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. సీఎం జగన్ సూచనల మేరకు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: