కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో కేవలం ఆరు రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపైంది. నిన్న ఒక్కరోజే జిల్లాలో 27 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రోజురోజుకు మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఏప్రిల్ 6వ తేదీ వరకు జిల్లాలో 74 కేసులు నమోదయ్యాయి. ఈ నెల 18 వరకు 130 కేసులు నమోదయ్యాయి. 
 
కేవలం ఆరు రోజుల్లో జిల్లాలో కేసుల సంఖ్య 261కు చేరింది. కర్నూలు జిల్లాలో అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడానికి ఒక విధంగా ఢిల్లీలో జరిగిన ప్రార్థనలే కారణం. జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రంలో మర్కజ్ లింక్ లు గుర్తించే సరికి జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందింది. ఆ కేసుల్లో కొన్ని ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా ఆ కేసులు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం గమనార్హం. 
 
జిల్లాలో కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లోనే ఎక్కువ సంఖ్య్లలో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం హాట్ స్పాట్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. అందువల్ల జిల్లాలో ప్రస్తుతం భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నా మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 
 
అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం రెడ్ జోన్ ప్రాంతాలలో ర్యాండమ్ గా కరోనా పరీక్షలు నిర్వహించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: