దేశంలో కరోనా కేసుల నమోదులో శుక్రవారం తీవ్రస్థాయికి చేరింది. గత 24 గంటల్లో 1,752 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 23,452కు చేరింది. 37 కొత్త మరణాలు నమోదుకాగా ఈ సంఖ్య 723కు పెరిగినట్లు కేంద్రం పేర్కొంది. మరోవైపు కోలుకున్నవారి సంఖ్యలోనూ శుక్రవారం కొత్త రికార్డు నమోదైంది. మొత్తం 4,748 మంది కోలుకున్నట్లు తెలిపింది. క్రీయాశీలక కేసులతో పోల్చితే కోలుకున్నవారు 20.57 శాతం ఉన్నట్లు పేర్కొంది. ఇదే స‌మ‌యంలో నాలుగు నగరాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్న‌ట్లు కేంద్రం గుర్తించింది. అందులో తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ ఉండ‌టం,  పైగా కేంద్రం బృందం ప‌ర్య‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 


కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, సూరత్‌ , తమిళనాడులోని చెన్నై, తెలంగాణలోని హైదరాబాద్‌లో వైరస్‌ వ్యాప్తి పరిస్థితి తీవ్రంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఐదు కేంద్ర బృందాలు ఈ నగరాలకు వెళ్లినట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లఘింస్తున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని, ఇలాంటివి ప్రజారోగ్యానికి ముప్పుగా మారవచ్చని పేర్కొన్నారు. కరోనా తీవ్రతను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం హైదరాబాద్‌ చేరుకుంది. గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటు చేసిన టిమ్స్‌లో సదుపాయాలను పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం టిమ్స్‌ను కరోనా రోగులకు అందుబాటులోకి తీసుకురావడంతో అక్కడి ఏర్పాట్లను పరిశీలించింది. 

 

కాగా, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాలను కేంద్ర బృందాలు పరిశీలిస్తున్నాయి. కరోనా తీవ్రతను అంచనావేసి, ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తాయి. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న స్పందించి ఏర్పాటు చేసిన ఈ టిమ్స్ ప‌ట్ల కేంద్రం ప్ర‌శంస‌లు కురిపిస్తుందా లేదా కేసులు పెద్ద ఎత్తున న‌మోదు అవ‌డం ప‌ట్ల ఏమైనా మార్గ‌ద‌ర్శ‌కాలు అందిస్తుందా? అనే ఆస‌క్తి నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: