అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. దేశంలో నిన్న ఒక్కరోజే 38,764 కేసులు నమోదవగా, ఈ వైరస్‌ ప్రభావంతో 1,951 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.25 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు మృతిచెందినవారి సంఖ్య 52,185కు చేరింది. ఈ స్థాయిలో విజృంభిస్తున్న‌ క‌రోనా వైర‌స్ ఆ దేశాన్నికోలుకోలేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఆర్థిక రంగంపై పెనుభారాన్ని వేస్తోంది. దీంతో స‌హ‌జంగానే అక్క‌డ ఉపాధి అవ‌కాశాలు స‌మ‌స్య‌ల్లో ప‌డిపోతున్నాయి. 

 

అమెరికాలో ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మంది.. ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. తాజా ఉద్యోగ గణాంకాల ప్రకారం అక్కడ ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నట్టు తేలింది. 1930లో ఏర్పడిన మహామాంద్యం తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఏర్పడినట్టు నిపుణులు చెబుతున్నారు. 1931-40 మధ్య నిరుద్యోగ రేటు కనిష్ఠంగా 14 శాతానికి పైగా ఉండగా, ఇప్పుడు గరిష్ఠంగా 25 శాతంగా నమోదైంది.  ఈ నేప‌థ్యంలోనే అక్క‌డ‌ నిరుద్యోగ భృతి కోసం 44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నార‌ని తెలుస్తోంది. కాగా, ఈ ద‌ర‌ఖాస్తుల విష‌యంలో ట్రంప్ స‌ర్కారు నిర్ణ‌యంపై ఆస‌క్తి నెల‌కొంది.

 


ప్రపంచ ఆర్థిక రాజధాని అనే పేరున్న న‌గ‌రం, అమెరికాలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన న్యూయార్క్‌లో ఇప్పటివరకు 2,76,711 కరోనా కేసులు నమోదవగా, 21,283 మంది మృతి చెందారు. న్యూజెర్సీలో కరోనా కేసుల సంఖ్య 1,02,196కు చేరింది. నగరంలో ఇప్పటివరకు 5,617 మంది మరణించారు. గత పది రోజుల్లో మృతుల సంఖ్య రెట్టింపైంది. దేశవ్యాప్త మరణాల్లో దాదాపు 40 శాతం న్యూయార్క్‌ రాష్ట్రంలో నమోదుకాగా, తర్వాతి స్థానాల్లో న్యూజెర్సీ, మిషిగాన్‌, మసాచుసెట్స్‌ ఉన్నాయి. ఇక అమెరికాలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 8.69 లక్షలకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో మూడో వంతు అమెరికన్లే ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: