స్థానిక ఎన్నికలు వీలైనంత త్వరగా జరిగితే.. బాగుండని ఏపీ సర్కార్ భావిస్తోందా..? ఎలక్షన్స్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తోందా..? ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం ఓ ప్లాన్‌ సిద్ధం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 

 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహాణ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎన్నికల ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చి ఆగిందో.. అక్కడే నిలిపేయాలని.. ఆ తర్వాత తిరిగి ప్రక్రియ ప్రారంభించాలని ఎస్‌ఈసీగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత ఏపీలో కరోనా మహమ్మారి విజృంభించింది. ఈ క్రమంలో ఇటీవలే కొత్త ఎస్‌ఈసీగా తమిళనాడుకు చెందిన రిటైర్డ్‌ న్యాయమూర్తి వి.కనగరాజ్‌ను నియమించిన ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తప్పించింది. దీనిపై హైకోర్టులో వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. దీనిపై ఈ నెల 28వ తేదీన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈలోగానే ఎన్నికల నిర్వహాణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి. కనగరాజ్‌ సమీక్షించారు. అలాగే, కరోనా ప్రభావం తగ్గాక ఎన్నికల నిర్వహాణపై ఓ నిర్ణయం తీసుకోవాలని భావించారు. దీని కోసం అధికారులూ సిద్దంగా ఉండాలని సూచించారు.

 

ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి.. ఎన్నికల నిర్వహాణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్‌ఈసీ కసరత్తు చేస్తోన్నట్టు తెలుస్తోంది. కరోనా ప్రభావం తగ్గినా భౌతిక దూరం పాటిస్తూ ఎన్నికల నిర్వహాణ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతమున్న పొలింగ్‌ బూత్‌ల సంఖ్య సరిపోవని ఎస్‌ఈసీ అధికారులు భావిస్తున్నాయి. ఓటర్లను నియంత్రించేందుకు.. క్యూ లైన్లు లేకుండా ఎన్నికల నిర్వహాణ ఏ విధంగా చేపట్టాలనే అంశంపై చేస్తున్న ఆలోచనలో భాగంగా మరిన్ని పొలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేసుకోవడం.. అలాగే ఓటర్లకు టైమ్‌ స్లాట్‌ ఇచ్చి దాని ప్రకారం ఓటేసేలా అవకాశం కల్పించడం ద్వారా ఓటర్లు గుమిగూడకుండా ఉండే అవకాశం ఉంటుందనేది ఓ ఆలోచన. ఎన్నికల నిర్వహాణ కోసం మెడికల్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూనే.. ఇంకోవైపు భౌతిక దూరం అమలు చేస్తూ ఎన్నికలను నిర్వహించొచ్చనే ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడే కాకున్నా.. కరోనా ప్రభావం తగ్గాక ఎన్నికలను ఇదే విధంగా నిర్వహిస్తే శ్రేయస్కరమనే భావన వ్యక్తమవుతోంది.

 

అయితే ఇప్పటికిప్పుడే ఈ విషయాలను చెప్పకుండా.. కరోనా ఎఫెక్ట్‌ తగ్గాక ఈ విషయాలను నెమ్మదిగా చర్చకు పెట్టాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇప్పుడే ఈ అంశాలను తెర మీదకు తెస్తే.. మళ్లీ లేని పోని విమర్శలు వస్తాయనేది ప్రభుత్వ ఆలోచనగా కన్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: