ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఆశ్చ‌ర్య‌పోయే రీతిలో అధికార పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నేత అంబ‌టి రాంబాబు సూచ‌న ఇచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన అంబ‌టి క‌రోనా విష‌యంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుధ్దితో ప‌నిచేస్తున్నా...కొందరు చేస్తున్న రాళ్లేసే కార్యక్రమం బాధ‌ అనిపిస్తోందన్నారు. ``చంద్రబాబు సీఎంగా 14 సంవత్సరాలు పనిచేసి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. నెలరోజుల లాక్ డౌన్ కాలంలో ఒక్క మంచి సలహా చంద్రబాబు ఇచ్చిన పాపాన పోలేదు. ఏదైనా ఇచ్చి ఉంటే చెప్పండి. బురదచల్లే కార్యక్రమం చేయ‌డం త‌ప్ప‌` అని వ్యాఖ్యానించారు. 

 

హైద‌రాబాద్‌లో ఉండి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిణామాల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. `` చంద్ర‌బాబు అప్పుడప్పుడు స్కైప్‌లో కనిపిస్తారు. సుధీర్ఘమైన ఉపన్యాసాలు చెబుతారు. మొన్న టీడీపీ ఎన్ఆర్ఐ మీటింగ్‌లో భజన చేసింది లోక‌మంతా చూశాం. సీఎం జగన్‌కు గంటల తరబడి ఉపన్యాసాలు చెప్పేందుకు ప్రావీణ్యత లేదు. పనిచేయడంలో మాత్రమే ఆయనకు ప్రావీణ్యత ఉంది. ఈరోజు రాష్ర్టంలో ఐఏఎస్,ఐపిఎస్ అధికారులందరితోను కలసికట్టుగా టీమ్ వర్క్ చేస్తున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. అందరితో రివ్యూలు చేస్తూ, చర్చిస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా దానిని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కోవిడ్ -19 ప్రమాదకరధోరణిలో ఉన్నప్పటికి కూడా సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా కొనసాగిస్తున్నారు.అన్నింటిని సమపాళ్లలో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న జగన్ పై హైద్రాబాద్ లో కూర్చుని చంద్రబాబు రాళ్లేస్తున్నారు.`` అని మండిప‌డ్డారు.

 


చంద్ర‌బాబు ప‌క్క రాష్ర్టంలో ఉండి విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాద‌ని అన్నారు. ``తెలంగాణ రాష్ర్టానికి, ఏపీకి హెరిటేజ్ ఫుడ్స్ నుంచి చెరి 30 లక్షల రూపాయలు చందా ఇచ్చారు. మీరు పర్సనల్ గా పదిలక్షలు ఇచ్చారు. రెండురాష్ర్టాలు నాకు సమానమే అన‌డం మంచిదే. తెలంగాణ రాష్ర్టంలో వారికి సలహాలు ఇవ్వరు. అక్కడ ఏమీ డిమాండ్ చేయరు. ఇస్తే కేసీఆర్ దరువు వేస్తారనే భయం. ప్రధానమంత్రి నరేంద్రమోది,అమిత్ షా కాళ్లు పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తారు. వాళ్లు మీకు కాళ్లు దొరకనివ్వరు. తెలంగాణలో ఒక రకంగా వ్యవహరిస్తారు. ఇక్కడొక రకంగా వ్యవహరిస్తారు. ఇక్కడ రాళ్లు వేయడం ధర్మం కాదని చెబుతున్నాను. నా ప్రజలు బాధపడుతున్నప్పుడు ...నా ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆ ప్రజల మధ్యకు వెళ్లి సలహాలు ఇవ్వాలనే జ్ఞానం మీకు ఎందుకు లేదు. ప్రజల పట్ల ప్రేమ లేదు.రాజకీయం చేయాలనే దుర్భుద్ది తప్ప మరోటి కనబడటం లేదు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఎలా  సహాయం చేయాలనే తాపత్రయం మీ దగ్గర ఏది?మీకు 70  ఏళ్లు వచ్చాయి. మా లాగానే వృధ్ధులు ...కరోనా సోకితే ప్రమాదం.మీరు రావడం లేదు సరే మంచిదే. మీ అబ్బాయి,యువకుడు, ఆరోగ్యవంతుడు...మీ వారసుడు...మంగళగిరిలో పోటీచేసి దురదృష్టంకొద్ది ఓడిపోయాడు.ఆయన ఎందుకు ఈ రాష్ర్టానికి రాడు.ఆయన ఎందుకు సలహాలు ఇవ్వడు? `` అంటూ అంబ‌టి చంద్ర‌బాబుపై పంచ్‌లు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: