బీజేపీలో కుర్చీ పోరు రంజుగా సాగుతోంది. పేరుకు జాతీయ పార్టీ కానీ ఏపీలో మాత్రం పార్టీకి పెద్దగా బలం లేదు. శాసనమండలిని కనుక రద్దు చేస్తే ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక బీజేపీకి ఉన్న ఇద్దరు ఎంపీలు టీడీపీ నుంచి అరువు వచ్చినవారే. ఈ నేపధ్యంలో కూడా బీజేపీ ఏపీ పీఠం కోసం ఓ రేంజిలో రేసు సాగుతోంది.

 

బీజేపీలో తరువాత అధ్యక్ష పదవి కోసం అనేక మంది పెద్దలు ఆశలు పెట్టుకున్నారు. ఈ లిస్ట్ లో కేంద్ర మాజీ మంత్రులు సుజనా చౌదరి, దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పీవీ ఎన్ మాధవ్ పేర్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీరిలో మాధవ్ కి మాత్రమే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటన దానికి ఉదారణగా చెప్పుకోవాలి.

 

బీజేపీలో వరిష్ట నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావుకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఓ వైపు కరోనా కట్టడికి క్రుషి చేస్తూనే తీరిక చేసుకుని పెద్దాయన ఆరోగ్యాన్ని  పనిగట్టుకుని మరీ మోడీ తెలుసుకున్నరంటేనే ఆశ్చర్యం కలగకమానదు.

 

అంతే కాదు, గత ఏడాది కూడా పీవీని పార్టీలో జరిగిన ఓ వీడియో సమావేశంలో ప్రధాని మోడీ ప్రత్యేకంగా పలకరించారు. ఇవన్నీ చూసినపుడు పీవీ కుటుంబం మీద ప్రధాని మోడీకి అభిమానమే కాదు, గురి కూడా ఉందని అంటున్నారు. పైగా యువకుడు, బీసీ వర్గాలకు చెందిన వాడు, వెనకబడిన ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన మాధవ్ కి ఈ పదవి ఇవ్వాలని  జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తోందని అంటున్నారు.

 

కన్నా లక్ష్మీ నారాయణ కాంగ్రెస్ నుంచి వచ్చారు. సామాజిక సమీకరణలు కలసి వస్తాయనుకుంటే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో ఇపుడు పార్టీకి వీర విధేయుడిగా ఉన్న పీవీ కుటుంబం నుంచే కొత్త ప్రెసిడెంట్ ని తీసుకురావాలనుకుంటున్నారని అంటున్నారు. అదే కనుక జరిగితే కన్నా సీటుకు కన్నం పడినట్లే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: