ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఇప్పటికే హాట్ స్పాట్ ప్రాంతాలలో నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. 
 
కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాలలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. విజయవాడలో గత మూడు రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఒక్క విజయవాడలోనే దాదాపు 120 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను మూసేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
సాధారణంగా ఆదివారం రోజున నాన్ వెజ్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. లాక్ డౌన్ వల్ల అధికారులు ఉదయం కొద్దిసేపు మాత్రమే ఈ దుకాణాలకు అనుమతి ఇస్తారు. ఈ దుకాణాలకు అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో సామాజిక దూరం పాటించడం అంత తేలిక కాదు. గుంపులు గుంపులుగా జనం నాన్ వెజ్ షాపుల దగ్గరకి వస్తే వారిని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. 
 
దీంతో ప్రభుత్వం విజయవాడ లో నాన్ వెజ్ దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చికెన్, మటన్ ప్రియులకు షాక్ అనే చెప్పవచ్చు. మరోవైపు రాష్ట్రంలో నిన్నటివరకు 1016 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో 275 కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. గుంటూరు, కృష్ణా జిల్లాలు ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: