ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో యుద్ధ భూమిగా మారింది.. ప్రజలంతా సైనికులుగా మారి.. ఈ వైరస్‌తో పోరాడుతున్నారు.. ప్రపంచం చేస్తున్న ఈ పోరులో తుపాకులు లేవు, బుల్లెట్లు పేలడం లేదు.. యూనిఫాం వేసుకున్న సైనికులు లేని రణమిది. సరిహద్దులు లేని పోరు ఇది. కాల్పుల విరమణ ఒప్పందాల్లేని యుద్ధమిది. ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాని కరోనా రణక్షేత్రమిది...

 

 

ఇకపోతే ఈ యుద్ధంలో బరిలో నిలిచిన శత్రు సైన్యానికి ఎలాంటి దయా, జాలీ లేదు. మానవత్వం మచ్చుకైనా కనబడదు.. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్లనే బేధం లేదు. ప్రార్థనా మందిరాల గురించి కానీ, మతం పట్ల కానీ, భూగర్భంలోని ఖనిజ సంపద గురించి కానీ దీనికి ఏ మాత్రం పట్టదు. కంటికి కనిపించని ఈ శత్రుసైన్యం క్రూరమైంది. దీని అజెండా లెక్కలేనన్ని ప్రాణాలను హరిస్తూ, ప్రపంచం మొత్తం శవాల దిబ్బగా మార్చేశాకే ఇది శాంతిస్తుంది కావచ్చూ.. ఇప్పటికే కొన్ని దేశాల్లో శవాల దిబ్బలు తయారవుతున్నాయి.. ఇక ముందు ముందు ఎన్ని విపత్తులు సంభవిస్తాయో అంచనాలకు కూడా అందడం లేదు.. ఇకపోతే విదేశాల్లో కరోనా ప్రభావం విపరీతంగా ఉంది.. ముఖ్యంగా లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది.

 

 

ఇప్పటికే అక్కడ కొత్త కేసులను చేర్చుకోలేమని దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రులు చేతులెత్తేశాయి. దీంతో శవాగారాలు, శ్మశాన వాటికలు నిండిపోతున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న కరోనా పేషంట్లతో రియోడిజెనీరో నగరంతో పాటు మరో నాలుగు ప్రధాన నగరాల్లోని ఆస్పత్రులు నిండిపోయాయి. దీంతో కొత్తవారిని చేర్చుకోలేమని అక్కడి వైద్య సిబ్బంది తేల్చిచెప్పడం విషాదకరం..

 

 

ఈ నేపథ్యంలో బ్రెజిల్‌లో  నమోదైన కరోనా కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నమోదైన అధికారిక కేసుల సంఖ్య 52,995 కాగా, మృతుల సంఖ్య 3600... అదీగాక అమెజాన్‌ రాష్ట్రంలోని మానాస్‌ నగరంలో.. ఒక శ్మశానవాటికలో పెద్దఎత్తున గోతులు తవ్వి, రోజూ వంద మృతదేహాలను సామూహిక ఖననాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీన్నిబట్టి అర్ధం చేసుకోండి అక్కడ పరిస్దితులు ఎలా ఉన్నాయో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: