క‌రోనా ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా క‌రోనా షాకుల ప‌రంప‌రలో తాజాగా మ‌రో అంశం చేరింది. మురుగునీటిలో, సాధారణ జలాల్లో కరోనా వైరస్‌ను గుర్తించగా.. తాజాగా దుమ్ము కణాల్లోనూ దీన్ని కనుగొన్నారు. కరోనా మరణాలు ఎక్కువ సంభవించడానికి వాయుకాలుష్యం ఓ కారణం కావొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. కరోనా సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతుంటాడని, అదే సమయంలో అతడు కలుషితమైన వాయువును పీల్చడం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొని చివరికి ప్రాణాలు కోల్పోతున్నాడని తెలిపారు. రెండు ప్రాంతాల్లో వాయు కాలుష్య నమూనాలను సేకరించి పరీక్షించామని, ఈ నమూనాల్లో కరోనా జన్యువును గుర్తించామని ఇట‌లీలోని బొలాన్యా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ లియోనార్డో సెట్టి తెలిపారు.

 

వాయు కాలుష్యం, వైర‌స్ గురించి లియోనార్డో వివ‌రిస్తూ... సాధారణంగా కరోనా రోగి తుమ్మినప్పుడుగానీ, దగ్గినప్పుడుగానీ ఆ తుంపర్ల ద్వారా వైరస్‌ బయటికొస్తుంది. ఈ తుంపర్లు సదరు రోగి నుంచి ఒకటీ, రెండు మీటర్ల దూరం మాత్రమే పడతాయి. అయితే ఐదు మైక్రాన్ల  కంటే తక్కువ వ్యాసం కలిగిన తుంపర్లు గాలిలో ఆయా ఉష్ణోగ్రతలను బట్టి నిమిషాల నుంచి గంటల వరకు గాలిలోనే రవాణా అవుతుంటాయని సెట్టి వివరించారు.  కాలుష్య కణాలనేవి వైరస్‌తో కూడిన తుంపర్లను మోసుకెళ్లే మైక్రో విమానాలుగా అభివర్ణించారు. అయితే ఇంత తక్కువ పరిమాణంలోని తుంపర్లలో ఉన్న వైరస్‌ల ద్వారా వ్యాధి వ్యాపిస్తుందని నిర్ధారణకు రావడం లేదన్నారు.  అయితే ఇది ఎంతటి పరిమాణంలో... ఎంత దూరం ప్రయాణించి... మనుషులకు ఎంతటి తీవ్రతను కలిగిస్తుందనే దానిపై లోతైన అధ్యయనం అవసరమని చెప్పారు.

 

 

ఇదిలాఉండ‌గా, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీలలో 80% మరణాలు కాలుష్యం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనే సంభవించినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ షాకింగ్ ప‌రిశోధ‌న నేప‌థ్యంలో ప‌రిసరాల ప‌రిశుభ్ర‌త మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చింది. అంతేకాకుండా, క‌రోనా వైర‌స్ వ్యాప్తి విష‌యంలో ప్ర‌జ‌లు మ‌రింత అల‌ర్ట్‌గా ఉండాల‌ని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: