దేశంలోని అన్ని రాష్ట్రాలలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ పొడిగించినా కరోనా ఉధృతి తగ్గడం లేదు. దేశంలో కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది...? అనే ప్రశ్నకు సరైన సమాధానం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే మే 13వ తేదీ తరువాత వైరస్ ఉధృతి తగ్గుతుందని చెన్నైకు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు చెబుతున్నారు. 
 
 
వైదీశ్వరన్ కోయిల్ జ్యోతిష్కుడు శివస్వామి కరోనా వైరస్ భారత్ లో పెద్ద నష్టాన్ని కలిగించదని అన్నారు. కరోనా వైరస్ గురించి ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు మేష రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలంలో కరోనా వైరస్ ప్రభావం పెరిగిందని అన్నారు. మే 13వ తేదీ నుంచి క్రమంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. కలియుగంలో మార్పులు, వ్యర్థాల వల్ల కరోనా వైరస్ ఏర్పడిందని అన్నారు. 
 
వైరస్ నుంచి రక్షించుకునే విధంగా దేశాన్ని, ఇంటిని స్వచ్చంగా ఉంచుకోవాలని శివస్వామి చెప్పారు. మరోవైపు దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 26,000 దాటింది. గడచిన 24 గంటల్లో దేశంలో 1990 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 824 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకూ 5804 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది.     
 
మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 800 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో మహారాష్ట్రలోనే అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరోవైపు గుజరాత్ లో కూడా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: