కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది.  అగ్రదేశాలు సైతం లాక్‌ డౌన్‌ కొనసాగిస్తున్నాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. కరోనాను కట్టడిచేయడంలో డాక్టర్లు, వైద్య సిబ్బందితోపాటు పోలీసులు కీలక భూమిక పోషిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఎండనకా వాననకా.. రోడ్లపైనే గడుపుతున్నారు. పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా... లాక్‌డౌన్‌ ఉల్లంఘించేవారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అనవసరంగా రోడ్లమీదకు వచ్చి కరోనా వాహకులుగా మారుతున్నారు చాలా మంది. ఇళ్లకే పరిమితమవ్వండి అంటూ పోలీసులు నెత్తినోరు మొత్తుకున్నా... చాలా మందికి పట్టడంలేదు. నిబంధనలను తుంగలో తొక్కి రోడ్లపై జులాయిగా తిరుగుతున్నారు. ఇప్పటికే లక్షల్లో  వాహనాలను సీజ్‌ చేశారు పోలీసులు. చాలా మందిపై కేసులు కూడా నమోదుచేశారు. అయినా రోడ్డు మీదకు వచ్చే వాళ్ల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. పోలీసులు చర్యలతో అత్యవసర సేవల్లో పనిచేస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. 

 

ఎప్పుడూ లేని విధంగా చలానాలతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. టూవీలర్‌కు సైడ్‌ మిర్రర్‌లు లేవంటూ ఫైన్‌ వేశారు. అసలు ఈ నిబంధన ఉన్న విషయమే చాలా మందికి తెలియదు. లాక్‌ డౌన్‌ సమయంలో మిర్రర్‌కు ఫైన్‌ వేశారు. మిర్రర్‌ లేనందుకు ఫైన్‌ 100 రూపాయలు అయితే... సర్వీస్‌ చార్జ్‌ 35 రూపాయలు. అంటే మొత్తంగా 135 రూపాయలు చెల్లించాలన్న మాట. ఎదో ఒకరోజు చలానా వేస్తే కట్టేయొచ్చు. కానీ అదే కారణంగా పలుమార్లు చలానాలు వేస్తే సగటు ఉద్యోగి దీనిని ఎలా కట్టాలిరా నాయనా అంటూ తలలుపట్టుకుంటున్నారు. కనీసం అద్దాలు కొనుక్కుని బిగించుకుందామనుకున్నా... లాక్‌డౌన్‌ కారణంగా మెకానిక్‌ షాపులు క్లోజ్‌ అయ్యాయి. అటోమొబైల్‌ దుకాణాలు కూడా మూతపడ్డాయి. ఈ సమయంలో అద్దాలు ఫిట్‌ చేసుకోవడం కూడా కష్టమే. 

 

మరోవైపు కొన్ని ప్రాంతాల్లో స్పీడ్‌ గన్స్‌ పెట్టి చలానాలు పంపిస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. రహదారులపై స్పీడ్‌ లిమిట్ గంటకు 30 కిలోమిటర్లు, 40 కిలోమీటర్లుగా అంటూ బోర్డులు పెట్టి మరీ... చలానాలు వేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘించి బయటకు వస్తున్నవారి పరిస్థితి ఎలా ఉన్నా... అత్యవసర సేవలు అందిస్తూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నా సగటు ఉద్యోగుల జేబుకు మాత్రం చిల్లుపడుతుంది. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారుతున్న  ఉద్యోగులు ఇలాంటి సమయంలో ట్రాఫిక్‌ చలానాలు ఎలా కట్టాలిరా దేవుడా అంటూ తలలుపట్టుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: