అదేంటో కరోనా కూడా ఆశ్చర్యపోయే రాజకీయం ఒక్క ఏపీలోనే సాగుతోంది. ఏపీలో కరోనా  ఓ వైపు వీర లెవెల్లో విజ్రుంభణ చేస్తోంది. మరో వైపు కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో అంతా కలసి తలో చేయి వేసి కరోనాని కట్టడి చేయాలి.  కానీ కొందరు  నాయకులు, కొన్ని  పార్టీల తీరు చూస్తే బాధాకరం.

 


ఏపీలో కరోనా కేసులు వేలల్లో  ఉంటాయని ఒక నాయకుడు బాధ్యతారహితంగా ప్రకటిస్తాడు. మరో నాయకుడు కేసులు దాచేస్తున్నారని అంటాడు. ఇంకో నాయకుడు ఏపీలో పాలన చేసింది చాలు తప్పుకో అంటాడు. మరో నేత వచ్చి ఏపీలో కరోనాను కట్టడి చేయాలంటే జగన్ గద్దె దిగాల్సిందేనని పిలుపు ఇస్తాడు. వీరంతా కలసి ఏపీలో లేరు. ఉన్నది ఎక్కడ అంటే పిచ్చివాళ్ళ స్వర్గం అని ఒకటి ఉంది. అక్కడే వీరు ఉండి ఉంటారని ఈ రాజకీయాలను చూసి రోత పుట్టిన వారు అంటున్నారు.

 

ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేసే స్థాయికి నేతలు దిగిపోతున్నారు. ఇంతకీ అంత పెద్ద ప్రమాదం ఏం ముంచుకువచ్చిందో అర్ధం కాదు. పోనీ కరోనా భూతం ఒక్క ఏపీలోనే ఉందా అంటే లేదు కదా. అది విశ్వవ్యాప్తంగా ఉంది. అయినా సరే మన నాయకులకు ఏపీలోనే కరోనా కనిపిస్తోంది.  జగన్ ఫెయిల్ అనేస్తున్నారు.

 

నిజానికి ఈ వ్యాధి కట్టడికి అగ్రరాజ్యాలే గింజుకుంటున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో మరణ శాసనమే కరోనా రాసిపారేసింది. అటువంటిది ఏపీలో కరోనా కేసులు కట్టడి చేయలేదని రాజీనామా చేయమనడం,  రాష్ట్రపతి పాలన విధించాలని కోరడమేంటో. వీరికి జగన్ అధికారంలో ఉండడమే బాధగా ఉందిలా ఉంది. దానికి కరోనా సాకు చూపిస్తున్నారు.

 

ఎన్నిసార్లు కరోనా సాయం కావాలో మరి. ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వేశారు. కరోనా కేసులు పెరిగాయని చెప్పి రాష్ట్రపతి పాలన కావాలని కోరుతున్నారు.  అనుకూల మీడియా చెలరెగిపోతూ ఏపీలో అసలు  ఏం బాలేదు అంటోంది. కసిని అంతా కుమ్మరించి కులాన్ని అందులో రంగరించి రాయడానికి అదేమైనా తోక పత్రికల రాతలనుకుంటున్నారా. అక్కడ ఉన్నది కరోనా,కరోడాలనే  ఒక్క దెబ్బకు హరీమనిపిస్తోంది.

 

దాన్ని అదుపు చేయాలంటే జనంలో చైతన్యం రావాలి. ఆ విధంగా ప్రజలకు మంచి మాట చెప్పే నేతలు, మీడియా ఉన్నాయి. అందరినీ కాదు కానీ విపక్షాల్లో కొన్ని పార్టీలు వెర్రి తలలు వేస్తూ వీరంగం వేస్తున్నారు. మరో వైపు అనుకూల మీడియా అడ్డంగా అచ్చేసి పిచ్చి రాతలు రాస్తోంది. అంటే కరోనా రూపంలో అయినా అధికార పార్టీ గబ్బు పట్టి గద్దె దిగిపోవాలి. ఇది బానే ఉంది కానీ అదే డిమాండ్ అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏ ఒక్క  ప్రభుత్వాలు ఉండవు, ఇక కేంద్రంలో కూడా రాష్ట్రపతి పాలనే రావాలేమో. మొత్తానికి కరోనా కూడా విష రాజకీయ ముందు ఓడిపోతోందిగా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: