కరోనా వ్యాక్సిన్ తయారీకి ప్రపంచమంతా శ్రమిస్తోంది. తానూ ఓ చేయి వేస్తానంటున్నారు వ్యాక్సిన్ ల  పితామహుడు స్టాన్లీ ప్లాట్ కిన్. రూబెల్లా, పోలియో, ఆంత్రాక్స్, రేబిస్ లాంటి వ్యాధులకు వ్యాక్సిన్ తయారీలో పాల్గొన్న అనుభవం ఆయన సొంతం. ఇప్పటికే వైరస్ ను నిర్వీర్యం చేసే కిటుకు కనిపెట్టానంటున్నారు స్టాన్లీ.

 

కరోనాపై పోరాటానికి వ్యాక్సిన్‌ గాడ్‌ఫాదర్‌ స్టాన్లీ ప్లాట్‌కిన్‌ నడుం బిగించారు. అమెరికా కంపెనీలతో కలిసి పని చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. స్టాన్లీ ప్లాట్‌కిన్‌ వయస్సు 87 సంవత్సరాలు. వ్యాక్సీన్‌ల తయారీలో ఆయనకు 60 ఏళ్ల అనుభవం ఉంది. 60వ దశకంలో అమెరికాను వణికించిన రుబెల్లా మహమ్మారికి వ్యాక్సిన్‌ తయారీలో కీలకపాత్ర పోషించారు స్టాన్లీ ప్లాట్‌కిన్‌. పోలియో, ఆంత్రాక్స్‌, రేబిస్‌, రోటా వైరస్‌లపై ఆయన పరిశోధనలు చేశారు. అందుకే అతన్ని వ్యాక్సీన్‌ గాడ్‌ఫాదర్‌గా పిలుస్తున్నారు. 

 

1960లో అమెరికాలో ప్రబలిన రుబెల్లాకు... ఇప్పటి కరోనా వైరస్‌కు చాలా తేడా ఉందంటున్నారు వ్యాక్సిన్‌ గాడ్‌ఫాదర్‌ స్టాన్లీ ప్లాట్‌కిన్‌. అప్పట్లో ప్రతి 100 మంది గర్భిణుల్లో ఒకరిని రుబెల్లా బలిగొనేదని ఆయన గుర్తు చేశారు. కరోనా వైరస్‌ అంత ప్రమాదకారిగా కనిపించకపోయినా... ఆదమరిస్తే అందరినీ బలిగొనేంత హానికరమైంది. ముఖ్యంగా వృద్ధుల పాలిట కరోనా వైరస్‌ అంత్యంత ప్రమాదకారి అంటున్నారు స్టాన్లీ ప్లాట్‌కిన్‌. అంతేకాదు... కరోనాను కట్టడి చేయడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడాలంటున్నారు. లేదంటే ప్రపంచ జనాభాలో 80 శాతం మంది దీని బారిన పడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు ఈ వ్యాక్సిన్‌ గాడ్‌ఫాదర్‌.

 

టీకాలు అభివృద్ధి చేయడంలో తనకు గల అనుభవాన్ని ఇప్పుడు కరోనా కట్టడికి ఉపయోగిస్తానంటున్నారు స్టాన్లీ ప్లాట్‌కిన్‌. వైరస్‌లను ఎలా నిర్వీర్యం చేయాలనే దానిపై తాను పట్టు సాధించానని... ఆ విషయ పరిజ్ఞానం, అప్పటి ప్రత్యక్ష అనుభవం ప్రాతిపదికగా మానవాళికి తనవంతుగా మేలు చేసేందుకు సిద్ధమయ్యానంటున్నారు. అందువల్లే ఈ వయసులోనూ ల్యాబ్‌ వైపు అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు స్టాన్లీ ప్లాట్‌కిన్‌. 

 

వ్యాక్సిన్లతోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమంటున్నారు నిపుణులు. వ్యాక్సిన్‌ తయారీలో పలు దేశాలు పురోగతి సాధించాయి. మనుషులపై కూడా క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభించాయి. కానీ... వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావాలంటే కనీసం ఏడాది పడుతుందంటున్నారు. అంతేకాదు... అవి సమర్థవంతంగా పని చేస్తాయా? సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏవీ ఉండవా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాకు టీకా తయారు చేయడంలో తనవంతు సాయం అందిస్తానని వ్యాక్సీన్‌ గాడ్‌ఫాదర్‌ స్టాన్లీ ప్లాట్‌కిన్‌ ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆయనకు గల అనుభవం ఉపయోగించుకుని కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోగల వ్యాక్సీన్‌ను తయారు చేసే పనిలో పడ్డాయి అమెరికా కంపెనీలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: