ప్రపంచాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన దేశంలో సైతం అల్లలాడిస్తుంది.  గత నెల నుంచి మన దేశంలో కరోనా కేసులు మొదలయ్యాయి.. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ ప్రమాదం అనుకుంటే లోకల్ గా కూడా దీని ప్రభావం పడిపోయింది.  గత నెల 24 నుంచి అన్ని రాష్ట్రాలు కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెసిందే.  వాస్తవానికి ఈ నెల 14 వరకు లాక్ డౌన్ ఉండగా దాన్ని మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.  నేడు మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. 

 

ఇందులో ప్రధానంగా లాక్ డౌన్ పైనే చర్చ జరగనుంది. మే మూడో తేదీతో లాక్ డౌన్ ముగియనుంది.. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ ను పొడిగించాలా వద్దా అనే విషయంపై సీఎంల అభిప్రాయాలను తీసుకోనున్నారు. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ తీసేస్తే ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ఈ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫెరెన్స్ ప్రారంభం కానుండగా, మోదీ అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు.

 

లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు ఆగిపోయి, కోట్లాది మంది తమ ఉపాధిని కోల్పోయిన వేళ, ఆర్థిక వృద్ధి పాతాళానికి పతనం కాగా, దాన్ని తిరిగి నిలిపేలా కొన్ని కీలక నిర్ణయాలను ఈ దఫా మోదీ ప్రకటిస్తూ, లాక్ డౌన్ నుంచి ఉపశమనాన్ని కలిగించవచ్చని తెలుస్తోంది. నేడు ముఖ్యమంత్రులతో జరిపే వీడియో కాన్ఫెరెన్స్ వారి సలహాలు సూచనలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి, ప్రజా రవాణాను తిరిగి తెరవడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని కూడా మోదీ వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయని పీఎంఓ వర్గాలు అంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: