కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. రోజూ 50కి తక్కువ కాకుండా కొత్త కేసులు వస్తున్నాయి. మూడు రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. చూస్తేనే ఏపీ కేసుల సంఖ్య వెయ్యిదాటింది. ఇప్పుడు ఏకంగా.. 1177 కు చేరిపోయింది. మరి ఎందుకు ఇంతగా ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. ఇందుకు కారణాలేంటి.. ఈ విషయాలు పరిశీలించాల్సి ఉంది.

 

 

మొదట్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాస్త మెరుగనే చెప్పాలి. అందులోనూ కరోనా విషయంలో మొదటి నుంచి తెలంగాణలోనే కేసులు ఎక్కువగా వచ్చాయి. మర్కజ్ లింక్ ఉన్న వారు మొదట కరీంనగర్ కు వచ్చి అక్కడి నుంచి కరోనా స్ప్రెడ్ కావడానికి కారణమయ్యారు. అయితే కరోనా విషయంలో ఏపీలో మొదటి నుంచి కేసులు చాలా తక్కువ.

 

 

మొదట్లో నెల్లూరులో ఒక్క కేసు వచ్చినా ఆ తర్వాత తెలంగాణతో పోల్చుకుంటే చాలా తక్కువ కరోనా కేసులు వచ్చేవి. తెలంగాణ కంటే కనీసం 100- 150 కేసులు తక్కువగా ఉండేవి. కానీ కొన్నిరోజులుగా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏపీ క్రమంగా తెలంగాణను అధిగమించి ఏకంగా 11 వందల స్కోరు కూడా దాటింది. సోమవారం వెలువడిన హెల్త్ బులెటిన్‌ లో మొత్తం కేసుల సంఖ్య 1177కు చేరింది.

 

 

అయితే ఇలా కేసులు పెరిగిపోయేందుకు ఏపీలో జరుగుతున్న పరీక్ష సంఖ్యే కారణంగా అధికారులు చెబుతున్నారు. ఏపీ సర్కారు కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తెప్పించుకుంది. ట్రూనాట్ మిషన్ల ద్వారా టెస్టులు చేయించింది. దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేయిస్తోంది. అందువల్లే కేసుల సంఖ్య పెరుగుతుందంటున్నారు ఏపీ అధికారులు. ఇది నిజమైతే మంచిదే..

మరింత సమాచారం తెలుసుకోండి: