కరోనా దెబ్బకు మగ్గం మూలనపడింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గల వేలాది మంది నేత కార్మికులకు పనిలేకుండా పోయింది. దీంతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు నేతన్నలు.

 

నెల్లూరు జిల్లాలో పది వేలకు పైగా చేనేత కార్మిక కుటుంబాలున్నాయి. వెంకటగిరి, ఉదయగిరి, కోవూరు, కావలి నియోజకవర్గాల పరిధిలో వీరున్నారు. వెంకటగిరిలో నాణ్యమైన చేనేత చీరలు, మిక్స్ డ్ పట్టు చీరలను మగ్గాల మీదా నేయడంలో వీరంతా నేర్పరులు. ఉదయగిరి నియోజకవర్గంలో నేత చీరలు, పంచెలు, పట్టు వస్త్రాల నేస్తారు. ఇక కోవూరు, కావలిలలో స్వచ్చమైన పట్టు చీరలు తయారవుతాయి.  

 

కరోనా ప్రభావం మొదలైనప్పటి వీరికి చైనా నుంచి ముడి సరుకు రావడం లేదు. దీంతో సగం పనులు అప్పుడే ఆగిపోయాయి. కొందరు మాత్రం కర్ణాటక నుంచి వచ్చే వార్పులు, తమిళనాడు నుంచి వచ్చే రేషంతో చీరలు తయారు చేశారు. దీంతో కొంతలో కొంత చీరలు, పంచెలు నేసే వాళ్లకు పని వుండేది. లాక్ డౌన్ ప్రకటించాక పరిస్థితులు పూర్తిగా  మారాయి. 

 

మాస్టర్ వీవర్స్ ముడి సరుకు ఇచ్చి వస్త్రాలు చేయించుకోనేవారు. ఇక్కడ తయారైన వస్త్రాలను కర్ణాటక, తమిళనాడుతో పాటు దక్షిణ భారతదేశ మంతా ఎగుమతయ్యేవి. కానీ లాక్ డౌన్  వల్ల మార్కెటింగ్ ఆగిపోయింది. మరోవైపు ముడిసరుకు కూడా రావడం లేదు. దీంతో మాస్టర్ వీవర్స్ ఎవ్వరికి పని కల్పించే పరిస్థితిలో లేరు. దీంతో నేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. 

 

వార్పుకు ఇంత అని డబ్బులు తీసుకోనే నేత కార్మికులు... నెలన్నరగా పని లేకుండా వున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పది కేజీల బియ్యం, వెయ్యి రూపాయలతో జీవనం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు పని కల్పిస్తే సామాజిక దూరం పాటిస్తూ మగ్గాల మీద పనికి దిగుతామంటున్నారు  నేత కార్మికులు. 

 

మొత్తానికి కరోనా లాక్‌డౌన్‌తో నేత కార్మికుల వీధుల్లో మగ్గం శబ్ధమే వినిపించడం లేదు. వీరి ఆదుకోడానికి ప్రభుత్వం ఏలాంటి చేపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: