ప్రపంచమే ఇపుడు పెద్ద సంక్షోభంలో ఉంది. విశ్వమంతటిదీ ఒకే బాధ. మానవ మనుగడ మొదలైన తరువాత భూగోళం మొత్తం ఒక్కటై దిక్కులు పిక్కటిల్లేలా  కేక పెట్టిన సందర్భం బహుశా ఇదేనేమో. ఆర్ధిక సంస్కరణలు, ప్రపంచీకరణ తరువాత భూగోళమంతా ఒక్కటీ అని అంతా అన్నా అనుకున్నా నూటికి నూరు శాతం జరిగింది లేదు, నమ్మింది లేదు.

 

కానీ ఇపుడు ఒకే ఒక్క వైరస్ భూగోళం మొత్తాన్ని కలిపేసింది, కుదిపేసింది. ఈ నేపధ్యంలో దేశాలు దాటుకుని భారత్ లో కూడా కరోనా వచ్చేసింది. అన్ని రాష్ట్రాలను హడలెత్తిస్తోంది. ఏపీలో చూసుకుంటే నిన్నటివరకూ ఆ రెండు జిల్లాలు అని గర్వంగా చెప్పుకునే వారు. మొత్తం పదమూడు జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం జీరో కరోనాతో హ్యాపీగా ఉన్నాయని అంతా భావించారు.

 

అయితే ఇపుడు సిక్కోలుకు చిక్కులు వచ్చేశాయి. కరోనా మహమ్మారి అక్కడ కూడా తన ఇనుప పాదం మోపేసింది. దాంతో ఇపుడు అందరి చూపూ ఒకే ఒక్క జిల్లాగా ఉన్న విజయనగరం మీద పడింది.విజయనగరంలో ఇప్పటిదాకా కరోనా కేసులు అయితే లేవు. అయితే ఇటు విశాఖలో, అటు, శ్రీకాకుళంలో కేసులు ఉన్నాయి. దాంతో మధ్యనున్న విజయనగరం బిక్కుబిక్కుమంటోంది. 

 

ఏ వైపు నుంచి ఆపద ముంచుకువస్తుందోనని అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎవరో ఒకరు మూర్ఖంగా ప్రవరిస్తే చాలు, మొత్తానికి కరోనా చుట్టేస్తుంది. దాంతో భయం గుప్పిట్లో ఇపుడు విజయనగరం బతుకుతోంది. కరోనా కాటేయకుండా కాపాడు అంటూ ముక్కోటి దేవుళ్ళను ప్రార్ధిస్తోంది.

 

మరి ఒకే ఒక్క జిల్లాగా విజయనగరం తన పేరుని నిలబెట్టుకుంటుందా. లేక సిక్కోలులో జరిగిన తప్పులే ఇక్కడా జరిగి ఇబ్బందుల్లో పడుతుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా విజయనగరం మాత్రం పదిలంగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు. ఆ జిల్లానైనా కరోనా పీడ నుంచి బయటపడేలా చేయాలని అంతా కలసి కోరుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: