కరోనా ప్రభావంతో దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతోంది. నెలాఖరు నాటికి ఇండియాలో నిరుద్యోగం 26 శాతానికి చెరుకుంటుందని అంచనా వేస్తోంది సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ. లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉండనుంది..? భారత్‌లో ఉద్యోగ స్వభావంలో వచ్చే మార్పులేంటి.? 

 

వైరస్ మహమ్మారి విజృంభణతో దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా అసంఘటిత రంగంపై ఆధారపడిన వారిపై లాక్‌డౌన్ తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులపై లాక్‌డౌన్ ముందు.. తర్వాత ఏ విధంగా ఉందనే దానిపై పరిశోధనలు చేసింది సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ. ఆ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం మార్చి ఒకటో తేదీ నాటికి దేశంలో నిరుద్యోగిత 7.91 శాతం ఉండేది. ఏప్రిల్‌ ఒకటి నాటికి అది కాస్తా ఒక శాతం పెరిగి 9 శాతానికి చేరుకుంది. అయితే లాక్‌డౌన్ కొనసాగడం వల్ల నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోయి 23.56 శాతానికి చేరింది. అంటే కేవలం 25 రోజుల్లో నిరుద్యోగం దేశంలో 14 శాతం పెరిగింది. ఏప్రిల్ నెల చివరికి ఇది మరింత రికార్డు స్థాయిలో పెరిగి 26 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తోంది సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ.

 

నిరుద్యోగం పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడం కలవరం రేపుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పట్టణాలను పోల్చినప్పుడు.. ఏప్రిల్ 25 నాటికి పట్టణ ప్రాంతాల్లో 25.46 శాతం నిరుద్యోగిత ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో 22.71 శాతముంది. తెలంగాణలో 2019 డిసెంబర్‌ నాటికి నిరుద్యోగం రేటు 2.3 శాతం ఉండగా.. మార్చి నెలాఖరుకి అది కాస్తా 5.8 శాతానికి చేరింది. జాతీయ సగటు నిరుద్యోగ అంచనాలతో కలిపితే.. ప్రస్తుతానికి తెలంగాణలో ఆ శాతం 15 వరకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. 

 

లాక్‌డౌన్ వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయనేది అందరికీ తెలిసిన విషయమే అయినా.. పరిస్థితులు చక్కబడిన  తర్వాత ఆర్ధిక పరిస్థితి ఎంతవరకు పునరుద్దరించబడుతోందనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఉపాధి కోల్పోయిన వారిలో ఎంత మందికి ఉద్యోగం వస్తుందనేది కీలకంగా మారింది. కరోనా కారణంగా ఓ సంస్థ తొలగించిన ఉద్యోగులను మళ్లీ భర్తీ చేసే అవకాశం చాలా తక్కువే అంటున్నారు నిపుణులు. తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవాలనే స్వభావం ఎక్కువగా ఉండే కంపెనీలు.. ఆ రకంగా నష్టాలను భర్తీ చేసుకోవాలనుకోవడం కూడా తప్పేమీ కాదంటుంది ఆర్ధికరంగం.

 

లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి సొంతూళ్ల బాట పట్టిన వలస కూలీలు.. తిరిగి పట్టణాలకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువగానే ఉంటుందంటున్నారు కొందరు నిపుణులు. పల్లెల్లో ఉండే సామూహిక స్వభావం కష్టకాలంలో రోడ్డు మీద పడేసిన పట్టణ వ్యవస్థపై నమ్మకం కోల్పోయారని, ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించే క్రమంలో అసంఘటిత రంగ కార్మికులు కీలకం కనుక ఉద్యోగ స్వభావంలో మార్పులు వస్తాయంటున్నారు. ఉద్యోగ భద్రత, మెరుగైన పని వాతావరణం కల్పించక తప్పని పరిస్థితులు ఏర్పడతాయని అంటున్నారు. 

 

మొత్తం మీద లాక్‌డౌన్ ప్రభావం నిరుద్యోగిత, ఉద్యోగ కల్పన స్వభావం, అవసరమైన నైపుణ్యాలు.. ఇలా అనేక అంశాల్లో తీవ్ర మార్పులు తెస్తుందని అంచనా. 

మరింత సమాచారం తెలుసుకోండి: