ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హైకోర్టు దీనికి సంబంధించి అందరి వాదనలు వింటోంది. ఈ కేసులో నిమ్మగడ్డ కొత్త ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ ను కూడా ప్రతివాదిగా చేర్చారు. దీంతో ఆయనకు కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. దీనికి ఆయన అఫిడవిట్ రూపంలో తన వాదన వినిపించారు.

 

 

కనగరాజ్ స్వయంగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయినందువల్ల మంచి లాపాయింట్లు లాగి మరీ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ వాదనలో జస్టిస్ కనగరాజ్ వినిపించిన వాదన అటు టీడీపీకీ ఇటు నిమ్మగడ్డకూ ఒకేసారి షాక్ ఇచ్చేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ ను పిటిషన్లర్లు ప్రశ్నించలేరని కనగరాజ్ అంటున్నారు. కేంద్రానికి భద్రత కోరుతూ నిమ్మగడ్డ దాఖలు చేసిన ఆఫీస్ ఫైల్స్ అందుబాటులో లేని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

 

 

ఎన్నికల కమిషనర్ నియామకం, సర్వీస్ రూల్స్ గవర్నర్ పరిధిలోనివే అని కనగరాజ్ గుర్తు చేశారు. నిమ్మగడ్డ ప్రభుత్వ సేవకుడిగానే ఎన్నికల కమిషనర్ పదవిలో నియమితులయ్యారని అన్నారు. నిమ్మగడ్డ తొలగింపు కోసమే ఆర్డినెన్స్ తీసుకొచ్చారనే వాదన న్యాయపరంగా చెల్లదని కనగరాజ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసమే పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేశారన్న కనగరాజ్ ఎన్నికల కమిషనర్ నియామకానికి గవర్నర్ కు అన్ని అధికారాలున్నాయని అన్నారు.

 

 

చట్టంలో మార్పులతో నిమ్మగడ్డ పదవి కోల్పోయారు తప్ప ఆయన్ను ప్రభుత్వం తొలగించలేదని కనగరాజ్ అన్నారు. నిమ్మగడ్డ పిటిషన్లో పేరాలకు పేరాలు ఇతర పిటిషనర్లు కాపీ కొట్టారని కనగరాజ్ గుర్తు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: