కరోనా కాలంలో అన్నీ ఉన్న మహరాజులకు ఎలాగైనా కాలం గడిచిపోతోంది. కానీ పొట్టకూటి ఉన్నఊరు, కన్నవాళ్లను వదిలి ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వారి జీవితాలు మాత్రం దుర్భరంగా తయారయ్యాయి. తినడానికి తిండి లేదు.. ఉన్నవాళ్లు కన్నవాళ్లు, కడుపున పుట్టిన వాళ్లు ఎలా ఉన్నారో తెలియదు. వెల్దామంటే లాక్ డౌన్‌ నిబంధనలు అడ్డు.

 

 

ఇలాంటి వారి దయనీయ కథనాలు పత్రికల్లో అనేకం వస్తున్నాయి. అందుకే జగన్ వీరి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సొంతూళ్లకు వెళ్లాలనుకునే వలస కూలీలకు శుభవార్త చెప్పారు. కూలీలను వారి స్వగ్రామాలకు పంపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత స్థాయి సమావేశంలో మార్గదర్శకాలు ఖరారు చేశారు. అయితే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి.

 

 

గ్రీన్ జోన్ నుంచి మరో గ్రీన్ జోన్ కి వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. వలస కూలీలు ఎక్కడ ఎంత మంది ఉన్నారో లెక్కించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ముందు కూలీలకు ర్యాపిడ్ విధానంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. నెగిటివ్ గా నిర్ధారణ అయిన వారిని మాత్రమే అనుమతిస్తారు.

 

 

ఒకవేళ కూలీల బృందంలో ఒకరికి పాజిటివ్ వచ్చినా వారంతా ప్రస్తుతం ఉన్న చోటే ఉండాల్సి ఉంటుంది. కరోనా నిబంధనల మేరకు వారికి వైద్య సాయం అందిస్తారు. నెగిటివ్ వచ్చిన వారి సొంత ఊర్లకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తారు. భౌతిక దూరం పాటిస్తూ బస్సులో ఉండే సీట్లలో యాభై శాతం మాత్రమే నిండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వీరు సొంత ఊరికి వెళ్లిన తర్వాత అక్కడి క్వారంటైన్ కేంద్రాల్లో 14 రోజులు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: