రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కరోనా మృతదేహాల ఖననం విషయంలో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళితే ప్రజలు దాడులకు పాల్పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఆత్మీయులే అంగీకరించటం లేదు. 
 
మృతదేహాల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చాలామంది విశ్వసించటంతో కరోనా మృతదేహాలను ఖననం కష్టాలు వెంటాడుతున్నాయి. మరి నిజంగానే మృత దేహాల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా...? అనే ప్రశ్నకు లేదనే సమాధానం వినిపిస్తోంది. భోపాల్ లో ఒక రెవిన్యూ అధికారి కరోనాతో చనిపోగా అతని భార్య, కొడుకు మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి నిరాకరించారు. చివరకు అధికారులే అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. 
 
హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకోగా జీ.హెచ్.ఎం.సీ సిబ్బంది ఆయనను ఖననం చేశారు. ఎవరైనా కరోనాతో చనిపోతే వారి మృతదేహాలను చూడటానికి కూడా ఎవరూ ఇష్టపడకపోతూ ఉండటం గమనార్హం. నిజానికి బ్రతికున్న వారిలో మాత్రమే కరోనా వైరస్ ఎక్కువ కాలం జీవిస్తుంది. చనిపోయిన వారిలో వైరస్ పరిమితకాలం మాత్రమే ఉండే అవకాశం ఉంది. 
 
వైద్యులు కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలపై హైపో క్లోరైట్ ద్రావణం చల్లి ప్లాస్టిక్ కవర్ లో చుట్టి మృతదేహాల నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మృతదేహాల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందదని ఇప్పటికే ప్రకటన చేసింది. చనిపోయిన వారి నుంచి కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కరోనా రోగులను దహనం చేసినా, ఖననం చేసినా వైరస్ వ్యాప్తి చెందదని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు కరోనా మృతదేహాల ఖననానికి అడ్డు తగులుతున్న ఘటనలు చోటు చేసుకోవడంతో వారికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటన చేసింది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: