రైతు సమస్యలపై ఇటీవల లోకేశ్ ఓ ఉత్తరం రాశారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని.. ప్రభుత్వం ఈ విషయంపై స్పందించాలన్నది ఆ లేఖ ఉద్దేశ్యం. దానిపై ఇప్పుడు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. వ్యవసాయం అంటే ఏంటో తెలియని లోకేష్‌ కూడా వ్యవసాయం గురించి లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. రైతు పంటలకు మద్దతు ధర లేదని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.

 

 

వైయస్‌ జగన్‌ పాలనలో 14.70 శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని, 2019-20 సంవత్సరంలో పంటల దిగుబడి అధికంగా ఉందని వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి చెబుతున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారులే వ్యవసాయ ఉత్పత్తులను కొలుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తున్నారని వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. రైతుకు ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ రైతు బజార్లను ఏర్పాటు చేశామని నాగిరెడ్డి పేర్కొన్నారు.

 

 

తమ సర్కారు చేసిన గొప్పల గురించి చెబుతూనే మరోవైపు చంద్రబాబు జమానాను కూడా వైసీపీ నేతలు ఎండగడుతున్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఏనాడు తన కెబినెట్‌లో వ్యవసాయం గురించి చర్చించలేదని నాగిరెడ్డి ఆరోపించారు. అంతే కాదు. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.1100 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చారని నాగిరెడ్డి అంటున్నారు.

 

 

అయితే ఈ విషయంపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉన్నా.. ప్రతిపక్షాలు అన్నాక అలాగే లేఖలు రాస్తారని.. అలాగే ప్రశ్నిస్తారన్న సంగతి కొత్తేమీ కాదు. విపక్షాల విమర్శలు, అధికార పక్షం జవాబులూ అన్నీ రాజకీయాల్లో భాగంగానే చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: