కరోనా సమయంలో వైద్యులు, పారిశుధ్య సిబ్బంది..ఇతర అత్యవసర సేవలకు సంబంధించిన ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. వీరంతా ప్రభుత్వ ఉద్యోగులు.. వీరికి సర్కారు బీమా అందిస్తుంది. దీనికి తోడు వీరు డ్యూటీ చేయకపోతే ఉద్యోగం ఉండదు. కానీ సర్కారు కొలువు కాకపోయినా.. వారికి ఏమాత్రం తీసిపోకుండా కరోనా సమయంలో విధులు నిర్వర్తించేవారిలో జర్నలిస్టులు ముందువరుసలో ఉంటారు.

 

 

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు సేవలు అందిస్తున్నారు. కానీ వీరికి అత్యవసర సేవల సిబ్బంది తరహాలో ప్రభుత్వాల నుంచి బీమా రక్షణ లేదు. ఈ విషయంలో ఒడిశా, హర్యానా వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులను మెచ్చుకోవాలి. వారు జర్నలిస్టులకు కూడా బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. జర్నలిస్టుల సేవలను గుర్తిస్తున్నారు.

 

 

హర్యానా ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రమాద బీమా కల్పించింది. ప్రతి జర్నలిస్టుకు రూ. 10 లక్షల చొప్పున బీమా కల్పిస్తున్నట్లు హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. సీఎం మనోహర్‌ లాల్‌ నిర్ణయం పట్ల హర్యానా జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ఒడిశా సీఎం కూడా అదే తరహాలో నిర్ణయం తీసుకున్నారు. ఈయన ఇంకో అడుగు ముందుకు వేసి శభాష్ అనిపించుకున్నారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

 

 

ఒడిశా రాష్ట్రంలో కరోనా వైరస్‌ కారణంగా చ‌నిపోతే జర్నలిస్టుల కుటుంబానికి రూ. 15 లక్షల రూపాయాల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ప్రాణంత‌క కరోనా మ‌హ‌మ్మ‌రిపై ప్రజ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు జ‌ర్నలిస్టులు పోషిస్తున్న బాధ్యత అనిర్వచ‌నీయమ‌ని మెచ్చుకున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జ‌ర్నలిస్టులు నిబద్ధతతో పని చేస్తున్నారని నవీన్ పట్నాయక్ కొనియాడారు. కనిపించని శత్రువుతో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులు ముందుండి పోరాడుతున్నా... జర్నలిస్టుల విషయంలో మాత్రం తెలుగు సీఎంలు అంతగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: