హైదరాబాద్ నగరం లాక్ డౌన్ లో ఉంది. జనం ఇళ్లకు పరిమితమయ్యారు. కానీ వీధుల్లో చెత్త-చెదారాలు పెద్దగా కనిపించడం లేదు. జనావాసాల్లో పారిశుధ్యంతో పాటు ఫాగింగ్‌ వంటి పనులపైనే ఫోకస్‌ పెరిగింది. ఇంతకీ హైదరాబాద్‌ మహానగరంలో జీహెచ్ ఎంసీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటో తెలుసా..? 

 

లాక్ డౌన్ కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని మరింత పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో రోడ్డెక్కే జనం అనూహ్యంగా తగ్గిపోయారు. అలాగే గతంలోలా ఎక్కడబడితే అక్కడ చెత్త కనిపించడం లేదు.   

 

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిత్యం వాణిజ్య సంస్థలు నుంచి వచ్చే ఘన వ్యర్థాలు ఎక్కువ. కానీ లాక్ డౌన్ వల్ల అవన్నీ మూతపడ్డాయి. అలాగే భవన నిర్మాణం... ఇతరత్రా వాణిజ్య పరమైన కార్యకలాపాలు ఆగిపోయాయి. దీంతో వాటి వల్ల ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు లేవు. ఇక పారిశుద్ధ్య కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరవుతున్నారు. నివాస ప్రాంతాల్లో సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు డంప్ యార్డుకి తరలిస్తున్నారు. ఇప్పుడు వ్యర్థాలు నివాస ప్రాంతాల నుండి మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో రోజుకు 6 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంది. కానీ లాక్ డౌన్ వల్ల జనావాసాల నుంచే చెత్త వస్తోంది. దీంతో ఆరు బయట వ్యర్థాలు కనిపించడం లేదు. రోజుకు దాదాపు 1500 మెట్రిక్ టన్నుల చెత్త తగ్గింది.

 

జీహెచ్ ఎంసీ పరిధిలో సుమారు 20 వేల మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్లంతా ప్రస్తుతం జనసంచారం లేకున్నా నగరాన్ని శుభ్రంగా ఉంచే పనిలో నిమగ్నమయ్యారు. 2 వేల 500 మంది ఫాగింగ్, యాంటీ-లార్వా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సోడియం హైపోక్లోరైట్‌ పిచికారి పనికి మరో 2 వేల 500 మంది కార్మికుల్ని వినియోగిస్తున్నారు. 

 

హైదరాబాద్‌ నగరంలో చెత్త తగ్గినా నీటి వినియోగం పెరిగిందని జలమండలి లెక్కలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ విస్తరించకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న జనం ఇళ్లలో నీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌కు రోజుకు 410 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం వాణిజ్య అవసరాలు లేకపోయినా నీటి వినియోగం తగ్గలేదు. 

 

మొత్తానికి కరోనా లాక్‌డౌన్‌ వల్ల గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో చెత్త తగ్గినా... నీటి వినియోగం పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: