మే 3వ తేదీ.. దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న రెండో ద‌శ లాక్‌డౌన్ ముగిసే గ‌డువు. మ‌రో మూడు రోజుల్లో ఈ గడువు ముగుస్తుంది.. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య‌నేమో అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు  30వేల మార్క్‌ను పాజిటివ్ కేసుల సంఖ్య దాటుతోంది. ఈ నేప‌థ్యంలో 3వ తేదీ త‌ర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించాలా..? వ‌ద్దా..? ఒక‌వేళ పొడిగిస్తే..ఎప్ప‌టివ‌ర‌కు పొడిగించాలి..?  రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల‌వారీగా లాక్‌డౌన్‌ను విభ‌జించాలా..? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ప‌లువురు ముఖ్య‌మంత్రులు లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని సూచించారు. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ మాత్రం ఏకంగా మే 21వ తేదీ వ‌ర‌కు పొడిగించాల‌ని సూచించారు. ఆమెకు మ‌ద్ద‌తుగా సుమారు ఐదుగురు సీఎంలు నిలిచారు. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది అంద‌రిలో ఉత్కంఠ రేపుతోంది. 

 

ఈ నేప‌థ్యంలో మే 2వ తేదీనే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ జాతిని ఉద్దేశించి కీల‌క సందేశం అందించే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. మే 2వ తేదీన ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ సందేశం ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, మే 3 త‌ర్వాత ఎలా ముందుకు వెళ్లాల‌న్న విష‌యంలో కేంద్రానికి స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉంద‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. దేశ‌వ్యాప్తంగా దాదాపుగా 300 జిల్లాల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మ‌రికొన్ని జిల్లాల్లోకూడా వైర‌స్ కేసులు ఒక‌టిరెండు మాత్ర‌మే ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా కేవ‌లం 15 జిల్లాల్లోనే క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఇందులోనూ ఏడు జిల్లాల్లో వైర‌స్ కేసులు అధికంగా ఉన్నాయి. అంటే.. దేశ‌వ్యాప్తంగా న‌మోదు అవుతున్న కేసుల్లో ఎక్కువ‌గా ఈ ఏడు జిల్లాల నుంచే ఉంటున్నాయ‌ని ఇటీవ‌ల నీతి ఆయోగ్ చీఫ్ కూడా చెప్పారు. తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌, మ‌హారాష్ట్ర‌లో ముంబై, పుణె, గుజ‌రాత్‌లో అహ్మ‌దాబాద్‌, రాజ‌స్తాన్‌లో జైపూర్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇండోర్ త‌దిత‌ర జిల్లాల్లోనే అధిక ప్ర‌భావం ఉన్న‌ట్లు గుర్తించారు. 

 

ఈ నేప‌థ్యంలో హాట్‌స్పాట్ల ఆధారంగా లాక్‌డౌన్ ఆంక్ష‌లు ఉండే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్ష‌లు య‌థావిధిగా కొన‌సాగుతాయ‌ని, మిగ‌తా ప్రాంతాల్లో స‌డ‌లింపులు ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నాయి. ఇదే స‌మ‌యంలో ప్ర‌జార‌వాణాకు అవ‌కాశం లేకుండా.. ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉంటూ స్థానికంగా ప‌నులు చేసుకునేలా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పైసా, ప్ర‌జ‌ల ప్రాణం రెండూ అవ‌స‌ర‌మేన‌ని చెప్పిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ.. క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటూనే ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చే దిశ‌గా నిర్ణ‌యం తీసుకుంటార‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: