దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. తెలంగాణలో గత నాలుగు రోజుల నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా ఏపీపై కరోనా పంజా విసురుతోంది. కొన్ని రోజుల క్రితం భారత్ కరోనా మహమ్మారితో పోరాడేందుకు, దేశంలో కరోనా కేసులను గుర్తించేందుకు చైనా నుంచి రాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకుంది. అయితే ఆ కిట్లలో నాణ్యత లేదని రాష్ట్రాలు భారత వైద్య పరిశోధన మండలికి సూచించాయి. 
 
భారత్ చైనా పంపిన నాసిరకం కిట్లను తిరిగి పంపించటానికి సిద్ధమైంది. దీంతో ఆ కంపెనీలు వెంటనే స్పందించి కాళ్ల బేరానికి వచ్చాయి. తాము నాణ్యమైన పరికరాలనే సరఫరా చేశామని, నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, తాము సరఫరా చేసిన కిట్లను నిషేధించవద్దని కోరాయి. చైనా రాయబార బృందం ఐసీఎంఆర్ తో కిట్ల గురించి చర్చలు జరుపుతోంది. 
 
చైనా రాయబారి వెయిడింగ్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షించి చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పుణెలో ఉన్న వైరాలజీ సంస్థ రాపిడ్ టెస్టింగ్ కిట్లను పరీక్షించి ఆమోద ముద్ర వేసిందని చెప్పారు. కిట్ల స్టోరేజీలో జాగ్రత్త వహించకపోవడం వల్లే కిట్లు సక్రమంగా పని చేసి ఉండకపోవచ్చని అన్నారు. 
 
చైనా కంపెనీలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని సూచించారు. కరోనా మానవాళికి ఉమ్మడి శత్రువని... అందరం కలిసి ఒక్కటిగా పోరాడి కరోనాపై విజయం సాధించాలని చెప్పారు. మరి ఐసీఎంఆర్ చైనా విజ్ఞప్తుల పట్ల ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలు చైనా కిట్లపై ఐసీఎంఆర్ కు ఫిర్యాదు చేశాయి. ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసిన కిట్లు మంచి ఫలితాలను ఇస్తుంటే చైనా నుంచి కొనుగోలు చేసిన కిట్లు మాత్రం సరైన పనితీరు కనబరచకపోవడం గమనార్హం.        

మరింత సమాచారం తెలుసుకోండి: