అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షల 36 వేల దాటగా... ఎప్పటి వరకు మొత్తం దాదాపు 60 వేల మంది మృత్యువాత పడ్డారు. ఒకరోజు మరణాల సంఖ్య తక్కువగా నమోదు కావడం మరొక రోజు రెట్టింపు స్థాయిలో మరణాల సంఖ్య నమోదు కావడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రపంచంలో నాలుగో వంతు కరోనా మృతులు, మూడవ వంతు కరోనా పాజిటివ్ కేసులు అమెరికా ఒక్క దేశంలోనే నమోదయ్యాయి. ఈ గణాంకాలను చూస్తుంటే ఇతర దేశాలకే భయం పుడుతుందంటే అతిశయోక్తి కాదు. దీని అన్నిటికీ కారణం డోనాల్డ్ ట్రంప్ సరైన సమయంలో సరైన చర్యలు చేపట్టకపోవడం అని అక్కడ మీడియా ప్రతిరోజు కోడైకూస్తోంది. ఒకవైపు కరోనా వైరస్ ని కట్టడి చేయలేక పోవడం... మరోవైపు మీడియా తనపై దుమ్మెత్తి పోయడం భరించలేకపోతున్నాడు ట్రంప్. ఇటీవల కాలంలో మీడియా తనపై తప్పుడు కథనాలు రాస్తోంది అని మండిపడ్డాడు. తాజాగా తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి సామాజిక మాధ్యమాలలో ఒక పోస్టు పెట్టాడు. 

 

 


ఆ పోస్టులో... 'అమెరికాలో ఎక్కువ కరోనా కేసులు ఎందుకు నమోదవుతున్నాయి అంటే... మా కోవిడ్ 19 టెస్టింగ్ పద్ధతి అన్ని దేశాల కంటే వేగవంతంగా, ఇంకా సమర్థవంతంగా కొనసాగుతుంది. ఇతర దేశాలు అన్ని కరోనా టెస్టింగ్ చేయడంలో చాలా వెనుకబడి ఉన్నాయి. అందుకే చాలా తక్కువ కేసులను చూపిస్తున్నాయి' అని ట్రంప్ పేర్కొన్నాడు. 

 


అయితే నెటిజనులు ఈ పోస్ట్ స్పందిస్తూ దేశంలో ఎక్కడా సంభవించని 60వేల మరణాలు అమెరికాలో సంభవించాయి కదా మరి దానికి ఏమని సమాధానం చెప్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ పరిస్థితి రాకపోయేదని మరికొందరు నెటిజనులు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. కరోనా మహమ్మారి రెండు మూడు నెలల్లో అంతం కాదని... కనీసం ఒక ఏడాది పాటు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు అమెరికాని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ఈ పెద్ద సవాల్ ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: