ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకోవడం అంత సులువైందేమి కాదు. కానీ ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకొని.. కరోనా ఫ్రీ దేశంగా మారింది న్యూజిలాండ్.. దాంతో దశల వారిగా అమలవుతున్న లాక్ డౌన్ ను సడలించింది. ఇంతకీ న్యూజిల్యాండ్‌ రాకాసిని ఎలా కట్టడి చేయగలిగింది? 

 

కరోనా కల్లోలానికి అగ్రరాజ్యాలే ఉలికిపడుతున్న వేళ.. న్యూజిలాండ్‌ ఊపిరి పీల్చుకుంది. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న  వైరస్‌ను వ్యాప్తి కాకుండా సమర్థవంతంగా అడ్డుకున్నట్టు సర్కార్‌ ప్రకటించింది. అలాగే నిబంధనలను సడిలిస్తున్నట్లు  తెలిపింది. కరోనా వ్యాపించి దేశంలో భయంకరమైన పరిస్థితులు నెలకొనకుండా ఆపగలిగామనేది ఆదేశ ప్రధాని జసిండా మాట. ఐదు వారాల క్రితం న్యూజిలాండ్‌లో అమలు చేసిన లెవల్-4 లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 27 అర్థరాత్రి నుంచి ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. లెవల్‌-4 లాక్‌డౌన్‌లో నిత్యావసరాలకు కోసం తప్ప ప్రజలు తమ ఇళ్లలోంచి బయటకు రావొద్దంటూ న్యూజిలాండ్‌లో కఠినంగా ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయకుంటే.. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండేవని ప్రభుత్వం అంటోంది. 

 

ఫిబ్రవరి 28 న్యూజిలాండ్‌ లో కరోనా తొలి కేసు నమోదు అయింది. ఇరాన్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు వైరస్‌ సోకిందని తేలింది. దాంతో వెంటనే అధికారులను రంగంలోకి దింపారు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌. విదేశాల నుంచి వచ్చిన వారిని నేరుగా క్వారంటైన్‌కు తరలించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు. అంతకు కొద్ది రోజుల ముందు నుంచి విదేశాల నుంచి వచ్చిన వారిని వెనువెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.  అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కరోనా చాపకింద నీరులా పాకింది. దాంతో మరిన్ని చర్యలు తీసుకున్నారు జెసిండా. మార్చి 15 నుంచి పద్నాలుగు రోజుల పాటు ప్రజలంతా ఎవరి ఇళ్లకు వారు పరిమితం కావాలని ఆదేశించారు. ఈ గడువు ముగియకముందే మార్చి 26 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఆమె నిర్ణయానికి ప్రజలందరూ మద్దతు పలికారు. లాక్‌డౌన్‌ను పక్కాగా పాటించడం వల్ల.. అప్పటి నుంచి కేసుల తీవ్రత తగ్గింది. వైరస్‌ వ్యాప్తి ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించారు ఆమె. కరోనా పీడిత ప్రాంతాలను ప్రత్యేక క్లస్టర్లుగా విభజించి పరిస్థితులు చేజారకుండా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసేలా చూస్తున్నారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పుడు నిత్యావసరాలకు కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు జెసిండా. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించడంతో న్యూజిలాండ్‌లో వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టింది. వీలైనంతమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయడంతోనే ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోగలిగామని చెబుతున్నారామె. దాని ఫలితమే ఇప్పుడు న్యూజిలాండ్ ను కరోనా ఫ్రీ దేశంగా చేసింది.

 

అయితే ప్రస్తుతం న్యూజిలాండ్‌లో లెవల్-3 లాక్‌డౌన్ అమలులో ఉంటుందని తెలిపిన ప్రధాని.. ఈ లాక్‌డౌన్‌లో స్కూళ్లు, రెస్టారెంట్లు పాక్షికంగా తెరవచ్చని అన్నారు. ఉద్యోగులు, కార్మికులు కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ.. తమ విధుల్లో చేరవచ్చని చెప్పిన ప్రధాని.. కోవిడ్-19 అదుపులో ఉన్న ప్రాంతంలో మాత్రమే పని చేయాలని ఆదేశించారు. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది తమ విధుల్లో చేరే అవకాశం ఉంది. అలాగే ఇతర దేశాల్లో 2.5శాతంగా ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి తమ దేశంలో 0.4శాతం మాత్రమే ఉందని ప్రధాని అర్డెర్న్ స్పష్టం చేశారు. అయితే కరోనా వ్యాప్తిని మాత్రమే అరికట్టామని.. దాని అర్థం దేశంలో కరోనా కేసులు లేవని కాదని అధికారులు అంటున్నారు.  న్యూజిలాండ్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఇంకా ఉందని హెచ్చరిస్తున్నారు.  అయితే రెండు వారాలపాటు లెవల్-3 లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని.. ఆ తర్వాత కేబినేట్ సమావేశం నిర్వహించి.. పరిస్థితులను బట్టి లెవల్-2 లాక్‌డౌన్‌ను విధించనున్నట్లు తెలుస్తోంది.

 

జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం న్యూజిలాండ్ లో మొత్తం కరోనా కేసులు 1,472 నమోదు కాగా.. 19 మరణాలు ఉన్నాయి.  వాటిలో 1,214 మంది అంటే 82 శాతం మంది కోలుకున్నారు.  న్యూజిలాండ్ మారుమూల ద్వీపం. దాంతో ఇతర దేశాల నుంచి వైమానిక రవాణాను వెంటనే తగ్గించి.. కరోనాను కట్టడి చేసింది. అలాగే న్యూజిలాండ్ రోజుకు 8000 కరోనా పరీక్షలను నిర్వహించగలిగింది.  అలాగే నిబంధనలు కూడా పక్కాగా అమలయ్యేలా చేయగలగడంతో దాదాపు నియంత్రించగలిగిందన్నది విశ్లేషకుల మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: