తెలంగాణ పోరాట సమయంలో  మా నీళ్లు మాకు కావాలే.. మా ఉద్యోగాలు మాకు కావాలే అంటూ పోరాటం చేశాం. మనకు రావాల్సిన నీటి గురించి ఓ లెక్క చెబుతూ..ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకు వచ్చిన గొప్ప వ్యక్తి తెలంగాణ జల వైతాళికుడు ఆర్‌. విద్యాసాగర్‌ రావు.  నేడు ఆయన 3వ వర్థంతి.. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. దివంగత ఆర్‌. విద్యాసాగర్‌ రావు తెలంగాణ జల వైతాళికుడు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. విద్యాసాగర్‌ రావు 3వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి హరీష్‌రావు ఘన నివాళులర్పించారు.  

 

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..  సమైక్య పాలనలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను విద్యాసాగర్‌రావు వెలుగులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. మన నీరు మన భూమి అంటూ ఆయన ప్రజల్లో ఎంతో స్ఫూర్తి తీసుకు వచ్చారు.  ఒక రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటే అక్కడ నీటి వనరులు చల్లగా ఉండాలి.. అలాంటిది సమైఖ్య పాలనలో మనకు ఆ నీటి విషయంలో ఎంతో అన్యాయం జరిగిందని ఎలుగెత్తి చెప్పిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు.

 

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ ప్రాంతం కోల్పోయిన ప్రతి నీటి బొట్టును లెక్కగట్టిన జలనిపుణులు ఆయన అని మంత్రి కొనియాడారు. ఆర్‌. విద్యాసాగర్‌రావు ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, ఆ ఫలితాలు ఇప్పటికే రాష్ట్రంలో కనబడుతున్నాయని హరీష్‌రావు స్పష్టం చేశారు. విద్యాసాగర్‌రావు ఆశించిన మేరకు బీడు భూముల్లో నీళ్లు పారుతున్నాయి. ఆయన ఆశయాలు ప్రతి తెలంగాణ బిడ్డలో ఉంటాయి.. ఆ మహనీయుడు ఆశయాల మేరకు చివరి వరకు పని చేయడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: