రాజ‌కీయంగా, గ‌త కొద్దికాలంగా లాక్ డౌన్ స‌మ‌యంలో నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండటం ద్వారా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీత‌క్క వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఏజెన్సీ గ్రామాల్లో నిత్యావసర సరుకులు అందజేస్తూ కరోనాపై అవగాహన కల్పించడంలో సీతక్క కీలక పాత్ర పోషించారు. దీంతో పాటుగా లాక్ డౌన్ వ‌ల్ల ఇటీవ‌ల‌ చాలామందికి ఒక పూట తిండి కూడా దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అలాంటి వాళ్ల ఆక‌లిని తీర్చేలా సీత‌క్క కొత్త ఛాలెంజ్ ను విసురుతున్న‌ట్లు వీడియో ద్వారా తెలిపారు. పేద‌ల‌కు సాయం చేయాలంటూ పిలుపు ఇచ్చారు. ఇలా విశిష్ట సేవ చేస్తున్న ఆమెకు ప్ర‌త్యేక పుర‌స్కారం ద‌క్కింది.

 
ఆకలితో అలమటిస్తున్న పేదలకు నిత్యం అందుబాటులో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క విశిష్ట సేవా పురస్కార్ కు ఎంపికయ్యారు. శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ప్రతినిధులు ములుగుకు వచ్చి సీతక్కను కలిసి ఎంపిక పత్రాన్ని అందజేశారు. 15 ఏళ్లుగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ అమరేష్ పేర్కొన్నారు. లాక్ డౌన్ పూర్తయిన తరువాత గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ఎమ్మెల్యే సీతక్కకు అవార్డును అందిస్తామని ఆయన తెలిపారు. 

 

కాగా, ఇప్ప‌టికే లాక్ డౌన్ క్ర‌మంలో ఇంట్లో ఖాళీగా ఉన్న కొంద‌రు ర‌క‌ర‌కాల ఛాలెంజ్​ల​‌తో టైమ్ పాస్ చేస్తున్న విష‌యం తెలిసిందే. వీటికి భిన్నంగా సీత‌క్క ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. గోహంగర్ గో పేరుతో ప్రారంభించిన ఈ ఛాలెంజ్ లో ఒక‌రు కొంత మంది పేద‌ల‌కు ఆహారం పంపిణీ చేయాలి. వారు మ‌రొక‌రికి ఇలాగే ఛాలెంజ్ చేయాలి. ఎవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌ని ఛాలెంజుల క‌న్నా ఆక‌లితో అల‌మ‌టించే వారి ఆక‌లిని తీర్చే ఈ ఛాలెంజ్ మంచిదని నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఎమ్మెల్యే ఆలోచనను పలువురు అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: