లాక్ డౌన్ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న వారికి ఊర‌ట క‌లిగించే వార్త‌. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తున్న లాక్ డౌన్ ఎక్క‌డిక‌క్క‌డ చిక్కుకుపోయి ఇబ్బందులు ప‌డుతున్న వ‌ల‌స కార్మికుల క‌ష్టాలు తీర‌బోతున్నాయి. ఈ మేర‌కు కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు కేంద్ర హోం శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ఇత‌ర రాష్ట్రాల్లో కూలీనాలీ చేసుకుని బ‌త‌క‌డానికి వెళ్లిన ఉన్న‌ట్టుండి లాక్ డౌన్ పెట్ట‌డంతో నిలిచిపోయిన వారిని సొంత రాష్ట్రాల‌కు తీసుకెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వారితో పాటు కోచింగ్ సెంట‌ర్లు, హాస్ట‌ళ్ల‌లో ఉండిపోయిన విద్యార్థులు, ఆధ్యాత్మిక‌, విహార యాత్ర‌ల‌కు వెళ్లి తిరిగి రాలేక‌పోయిన వారిని కూడా సొంత ప్రాంతాల‌కు చేర్చేందుకు అనుమ‌తి ఇచ్చింది. వారిని స్వ‌స్థ‌లాల‌కు చేర్చేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌కు సంబంధించి ఆదేశాలు ఇచ్చింది. 


వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న టూరిస్టులు, యాత్రికులు, విద్యార్థులు, వ‌ల‌స కూలీలు, ఇత‌రులు .. త‌మ త‌మ రాష్ట్రాల‌కు వెళ్లేందుకు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏర్పాట్లు చేయాల‌ని,  బ‌స్సుల ద్వారా చిక్కుకున్న వారిని త‌ర‌లించాల‌ని కేంద్ర హోంశాఖ ఆదేశాల్లో పేర్కొం‌ది. అయితే స్వంత రాష్ట్రానికి చెరుకున్న త‌ర్వాత‌.. వారంతా హోమ్ క్వారెంటైన్‌లో ఉండాల‌ని ప్ర‌భుత్వం సూచించింది.  స్థానిక అధికారులు టూరిస్టుల‌కు సంబంధించిన స‌మాచారాన్ని సేక‌రిస్తార‌ని, ఒక‌వేళ వాళ్ల‌కు హాస్పిట‌ల్ క్వారెంటైన్ అవ‌స‌రం వ‌స్తే అప్పుడు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించింది.

 

ఈ క్ర‌మంలో అన్ని రాష్ట్రాలు త‌మ ద‌గ్గ‌ర ఉన్న వ‌ల‌స కార్మికుల‌ను పంపడం, ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న వారిని తీసుకుని వ‌చ్చేందుకు నోడ‌ల్ ఆఫీస‌ర్ల‌ను నియ‌మించాల‌ని కేంద్రం సూచించింది. నిలిచిపోయిన కార్మికులు, యాత్రికులు, విద్యార్థులు ఎంత మంది ఉన్నార‌నేది గుర్తించి, ప్ర‌యాణానికి వారు రిజ‌స్ట‌ర్ చేసుకునే వీలు క‌ల్పించే డ్యూటీ నోడ‌ల్ ఆఫీస‌ర్ల‌దే. అలాగే వారంద‌రినీ ఎలా త‌ర‌లించాల‌న్న ప్ర‌ణాళిక‌ల‌నూ ఈ అధికారులు సిద్ధం చేయాలి. కాగా, అస‌లు స‌మ‌స్య ఇప్పుడే ఉంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు సొంత ప్రాంతాల‌కు చేర‌డం సంతోష‌క‌ర‌మేన‌ని అయితే..ఈ స‌మ‌స్య‌లో ఏ మాత్రం అ జాగ్ర‌తగా వ్య‌వ‌హ‌రించినా క‌రోనా క‌ల్లోలం మ‌రింత ఉధృతం అవుతుంద‌ని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: