చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో తమ ప్రజల్ని రక్షించుకోడానికి అన్ని శక్తులూ ఒడ్డి పోరాడుతున్నాయి ప్రపంచ దేశాలు. కానీ చైనా తీరు భిన్నంగా ఉంది. తమ ఆయుధాల ఆధునీకరణను కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఓ వైపు కరోనాతో పోరాడుతూనే... మరోవైపు రోబో అసల్ట్‌ వెహికల్‌ను సిద్ధం చేసింది చైనా. 

 

కరోనా మహమ్మారితో పోరాటంలో ప్రపంచ దేశాలు నిమగ్నమయ్యాయి. వైద్య సదుపాయాలు, పరికరాల కోసం అవుతున్న ఖర్చు అభివృద్ధి చెందిన దేశాలకు సైతం భారంగా మారుతోంది. అయినా సరే... మిగతా అన్ని కార్యక్రమాల్ని పక్కన పెట్టి ప్రజల్ని రక్షించుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ...  చైనా తన సైనిక పాటవాన్ని పెంచుకునే కార్యక్రమాల్ని కొనసాగిస్తోంది. 

 

మెషిన్‌ గన్‌తో కూడిన రోబో అసాల్ట్‌ వెహికల్‌ను రూపొందించింది చైనా. దీన్ని రిమోట్‌తో నియంత్రించవచ్చు. స్వయంగా తనంతట తాను కూడా నిర్ధేశిత పనుల్ని చేసిపెట్టగలదు. అసాల్ట్‌ వెహికల్‌పై మెషిన్‌ గన్‌తో పాటు క్రేన్‌ వంటి వ్యవస్థ ఉంటుంది. క్షిపణుల్ని లాంచ్‌ ప్యాడ్‌లపైకి ఎక్కించడానికి కూడా ఈ క్రేన్‌ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం క్షిపణుల్ని మనుషులు నడిపే క్రేన్ల సాయంతో లాంచ్‌ ప్యాడ్‌లపైకి ఎక్కిస్తున్నారు. రోబో వెహికల్‌ అందుబాటులోకి వస్తే... దీని సాయంతో యుద్ధ భూమిలోని లాంచ్‌ప్యాడ్‌లపైకి మిస్సైల్స్‌ను మోహరించే అవకాశం ఉంటుంది. 

 

రోబో అసాల్ట్‌ వెహికల్‌లో అమర్చిన ప్రత్యేక సెన్సర్ల ద్వారా రాత్రి వేళల్లోనూ శత్రువుల్ని అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలదు. మరీ ముఖ్యంగా కొండలు, గుట్టల వంటి ప్రాంతాల్లో కూడా ఇది సమర్థవంతంగా పని చేస్తుంది. 

 

భవిష్యత్తులో సైనికుల స్థానంలో రోబో అసాల్ట్‌ వెహికల్స్‌ వినియోగించే అవకాశం ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా శత్రు సేనల్ని నిలువరించడంలో ఇవి ఉపయోగపడతాయని భావిస్తోంది చైనా సైన్యం. ఈ రోబోకు అమర్చే ఆయుధాలు పూర్తిగా సైనికుల నియంత్రణలోనే ఉంటాయి. ప్రస్తుతం ఇవి పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ - PLA  వద్ద ప్రయోగ దశలో ఉన్నాయి. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఈ రోబో పనితీరు ప్రశంసలందుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: