లాక్ డౌన్‌తో అందరూ ఇంటి పట్టునే ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. మీరు ఇంట్లోనే క్షేమంగా ఉండండి... మేం అన్ని చూసుకుంటామని చెబుతున్నారు అధికారులు. దీని కోసం రాత్రి-పగలు అనే తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఆఖరికి ఇళ్లకు కూడా వెళ్లకుండా ఆ పోలీస్‌ స్టేషన్ లకే పరిమితమవుతున్నారు.  

 

కరోనా లాక్‌డౌన్‌తో జనం ఇళ్లకు పరిమితమయ్యారు. నిత్యవసరాల కోసం, అత్యవసర పరిస్థితుల్లో తప్ప గుమ్మం దాటికి బయటకు రావద్దని కోరుతున్నారు అధికారులు. అయితే కరోనా వైరస్‌ వ్యాపించకుండా లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయడం అధికారులకు కష్టంగానే ఉంది.  ఇక పోలీసులైతే... నిత్యం విధుల్లోనే ఉంటున్నారు. పగలు-రాత్రి అనే తేడా లేకుండా డ్యూటి లు చేస్తున్న పోలీసులు... ఇళ్లకు కూడా వెళ్లకుండా ప్రజా సేవలో నిమగ్నమైపోతున్నారు. పోలీస్‌ స్టేషన్‌నే ఇల్లుగా భావిస్తూ... అక్కడే ఉంటూ విధులకు వెళ్లి వస్తున్నారు.  


  
ఇది ఎస్ ఆర్ నగర్‌ పోలీస్‌ స్టేషన్లో దృశ్యం. ఈ పీఎస్ పరిధిలో క్రైం రేట్‌ అధికం. పైగా ఈ స్టేషన్‌ పరిధిలో రెండు ప్రముఖ ఆస్పత్రులున్నాయి. ఇక్కడ సీఐగా పని చేస్తున్న మురళీకృష్ణ నివాసముండేది వనస్థలిపురంలో. లాక్‌డౌన్‌ విధించాక మురళీకృష్ణపై పనిభారం పెరిగింది. దీంతో అప్పట్నుంచి ఇంటికి వెళ్లకుండా స్టేషన్ లో ఆయన ఉంటున్నారు. 


  
సీఐ మురళీకృష్ణే కాదు.. స్టేషన్ లోని మిగతా సిబ్బంది కూడా ఇళ్లకు వెళ్లబోమన్నారు. దీంతో అధికారులు, సిబ్బంది స్టేషన్ లోనే విశ్రాంతి తీసుకోడానికి ఏర్పాట్లు చేయడంతో పాటు నెల రోజులకు సరిపడ నిత్యవసర సరుకుల్ని సిద్ధం చేశారు మురళీకృష్ణ. వంటా-వార్పు వచ్చిన కానిస్టేబుళ్లకు ఆ పనిని అప్పగించారు. కాలనీల్లో రౌండ్స్‌కు వెళ్లడం... ఎవరైనా సరైన కారణం లేకుండా రోడ్లపైకి వస్తే హెచ్చరించి పంపడం... రెడ్‌ జోన్లలో నిత్యవసరాలు పంపిణీ, సెకండరీ కాంటాక్ట్‌ల గుర్తింపు వంటి విధులతో నిత్యం బిజీగా ఉంటున్నారు పోలీసులు. తమ కు కెటాయించిన సమయంలో డ్యూటి చేస్తూ... తరువాత పోలీస్ స్టేషన్‌కు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. 

 

లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా కరోనాను కట్టడి చేయడమే తమ లక్ష్యమంటున్నారు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు. ఇళ్లకు కూడా వెళ్లకుండా ప్రజసేవలో నిమగ్నమైన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసుల్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: