గత కొంతకాలంగా మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ, జగన్ ప్రభుత్వం లక్ష్యంగా తీవ్ర విమర్సలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనాని అడ్డం పెట్టుకుని ఆమె, ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో జగన్ ఫెయిల్ అయ్యారని చెబుతూనే, కరోనా వ్యాప్తి పెరగడానికి వైసీపీ నేతలే కారణమంటూ మండిపడుతున్నారు.

 

ముఖ్యంగా కర్నూలులో కేసులు పెరగడానికి కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యేనే కారణమని తీవ్ర ఆరోపణ కూడా చేశారు. ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టడం, ప్రభుత్వంపై విమర్సలు చేయడం చేస్తున్నారు. తాజాగా కూడా జగన్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఒకటి ఇచ్చారు. కర్నూలులో ఇప్పటి వరకు 332 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయని, 9 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారని, కానీ ఇవేగాక చాలా కేసులు ఉన్నాయని, అవి బయటకు రాకుండా ప్రభుత్వం దాస్తోందని అన్నారు.

 

ఒక్కరోజులో  కర్నూలు జిల్లాలో ఎన్ని కేసులు నమోదు అయినది, ఎంతమంది చనిపోయినది చెప్పకపోతే.. తానే అన్ని విషయాలు బయట పెడతానని హెచ్చరించారు. అలా చేయడంలో వల్ల ప్రభుత్వం పరువుపోతుందని, వైసీపీ నేతలు ప్రజలకు ముఖాలు కూడా చూపించలేరని కాస్త ఘాటుగా మాట్లాడారు. ఇక అఖిలప్రియకు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు. అసలు కేసులు దాచే పని జగన్ ప్రభుత్వం చేయదని, ఆ విషయం రోజూ వెల్లడించే కేసులు సంఖ్య బట్టి తెలుస్తోందని, పైగా ఎక్కువ టెస్టులు కేసుల చేస్తున్నారని అంటున్నారు.

 

కరోనా ఏమన్నా డబ్బులా బ్యాంకులో దాచుకున్నట్లు దాచుకోవడానికి, అయినా రాజకీయ లబ్ది పొందడానికే ఇలాంటి ఉపయోగం లేని హెచ్చరికలని చేస్తున్నారని, ఇలాంటి వాటిని ప్రభుత్వం అసలు పట్టించుకోదని చెబుతున్నారు.  జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కరోనా కట్టడికి కృషి చేస్తుండటం వల్ల ఓర్వలేక ఇలాంటి విమర్సలు చేస్తున్నారని మండిపడుతున్నారు. వైసీపీ నేతలు నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఇంకా ఇప్పటికీ ప్రజలకు ముఖం చూపించకుండా తిరుగుతున్న నేతలు ఎవరో తెలుసని కౌంటర్లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: