దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. మే 3వ తేదీ తరువాత కేంద్రం కరోనా కేసులు నమోదు కాని జిల్లాలలో లాక్ డౌన్ నిబంధనలు సడలించనుంది. 
 
ప్రధాని మోదీ అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు, భక్తులు, పర్యాటకులు, విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. వీరికి ఊరట కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిన్న కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. నిబంధనలకు లోబడి వారు సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర హోం శాఖ ఈ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సి ఉంటుంది. 
 
 
ఇప్పటికే పలు రాష్ట్రాలు వేరే రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వారిని సొంత రాష్ట్రాలకు తీసుకెళ్లాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు నోడల్ అథారిటీలను ఏర్పాటు చేసి నోడల్ యంత్రాంగం ద్వారా చిక్కుకుపోయిన వారి వివరాలకు రిజిష్టర్ చేయాలి. చిక్కుకుపోయిన వారు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్లాల్సి ఉంటే స్వీకరించే రాష్ట్రం వారిని రోడ్డు మార్గంలో తరలించేందుకు అంగీకారానికి రావాలి. 
 
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవారిని పరిశీలించి వైరస్ లక్షణాలు లేకపోతే మాత్రమే అనుమతించాలి. ప్రభుత్వం వీరి కోసం శానిటైజ్ చేసిన బస్సులను ఉపయోగించాల్సి ఉంటుంది. వారు కూర్చునేటప్పుడు భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలి. ఆయా వ్యక్తులు గమ్యస్థానాలకు చేరుకోగానే స్థానిక వైద్య సిబ్బంది పరీక్షించాలి. క్వారంటైన్ కేంద్రాలకు తరలించాల్సిన అవసరం లేకపోతే హోం క్వారంటైన్ కు తరలించాలి. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: