కరోనా కారణంగా ప్రపంచమే లాక్ డౌన్ అయ్యింది. అందులో భాగంగానే గుళ్లూ గోపురాలు కూడా దాదాపుగా మూతబడ్డాయి. నిత్యపూజలు, కైంకర్యాలు జరుగుతున్నా దర్శనాలు నిలిచిపోయాయి. అయితే ఈ కరోనా పుణ్యమా అని ఆ మేరకు ఆలయాలు ఆదాయం కోల్పోయాయి. ఇక ప్రపంచంలోనే ధనిక దేవుడిగా పేరున్న తిరుపతి వెంకన్నపై కూడా కరోనా ప్రభావం బాగానే పడింది.

 

 

కరోనా కారణంగా నెల రోజులకు పైగానే తిరుపతి వెంకన్న ఆలయంలో దర్శనాలు నిలిచిపోయాయి. దీంతో వెంకన్నకు దాదాపు 250 కోట్ల రూపాయల వరకూ ఆదాయం కోల్పోయినట్టు అంచనా వేస్తున్నారు. తిరుపతి శ్రీవారికి భక్తులు ప్రేమతో కానుకలు సమర్పిస్తారు. ఈ ఆదాయమే దాదాపు రోజురు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. దీనికితోడు అనేక పూజలు, దర్శనాలు, కాటేజీల అద్దెలు.. ఇలా పలు రకాలుగా తిరుపతి వెంకన్నకు ఆదాయం సమకూరుతుంది.

 

 

ఇప్పటికే నెలరోజులకు పైగా లాక్ డౌన్ అమలులో ఉండడంతో తిరుమలకు భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తం వీధులు ఖాళీగా కనిపిస్తున్నాయి. కాటేజీలు అన్ని నిర్మానుష్యంగా ఉన్నాయి. షాపులు మూతపడ్డాయి. తిరుపతి వెంకన్న ఆలయం అంటేనే అదో భారీ వ్యవస్థ.. దర్శనాలు లేకపోయినా ఆ వ్యవస్థ అంతా నడవాల్సిందే. ఇందుకు నిర్వహణ వ్యయం బాగానే ఖర్చవుతుంది.

 

 

అయితే తిరుపతి శ్రీవారికి ఇప్పటికే భారీగా డిపాజిట్లు ఉన్నాయి కాబట్టి ఆలయ నిర్వహణకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఆలయానికి సుమారు రెండువేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నట్టు అంచనా. వాటిపై వచ్చే వడ్డీతో నిర్వహణ సాగుతోంది. లాక్ డౌన్ ఎత్తి వేస్తేనే మళ్లీ తిరుగిరులు కళకళలాడతాయి. భక్తులకు ఆ తిరుమలేశుని దర్శనం దక్కుతుంది. త్వరలోనే శ్రీవారి దర్శనం భక్తులకు కలగాలని కోరుకుందాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: